మీరు కొత్తగా బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ కమోడిటీ రీసెర్చ్ అధిపతి రవీంద్రరావు మాట్లాడుతూ.. “గత శుక్రవారం 1 శాతం క్షీణత తర్వాత బంగారం ధర ఔన్స్ కు 1,812 డాలర్లకు తగ్గింది. ఆర్ధికంగా దేశాలు కోలుకోవడం, యుఎస్ డాలర్ కూడా ఒత్తిడి నుంచి కోలుకోవడం వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి” అని అన్నారు. ఇప్పుడు ఆ ప్రభావం మన దేశ బంగారం ధరల మీద కూడా పడింది. ఢిల్లీ మార్కెట్లో అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.48,423 నుంచి రూ.48,105కు పడిపోయినట్లు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో బంగార ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు అత్యధిక స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.49,090గా ఉంటే, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,990గా ఉంది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. నేడు కిలో వెండి ధర రూ.67,936గా ఉంది. బంగారం ధరపై చాలా అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి అంశాలు పుత్తడి ధరలపై ప్రభావం చూపుతాయని గమనించాలి.