కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినా రెండో దశ మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వెలువడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
తాజాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం కరోనా వైరస్ వ్యాక్సిన్ పంపిణీకి సన్నద్ధమవుతోంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళిక కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, కమిటీ కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ప్రకటించారు. ఈ కమిటీ కనీసం నెల రోజులకు ఒక్కసారి భేటీ కావాల్సి ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.