తెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల విషయంలో పారద్శకంగా ఉంటామని, ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. త్వరలోనే 60-70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా పేర్కొన్నారు. పండించిన వరి ధాన్యం కొనేలా కేంద్రంపై వత్తి తెస్తామని, రైతులతో కలిసి ధర్నాకు దిగుతామని కేసీఆర్ అన్నారు. వచ్చే శుక్రవారం అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర్నాలకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు..
తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందేనని, కేంద్రం ధాన్యాన్ని పూర్తిగా కొనే వరకు వదిలి పెట్టమని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ ఎందుకని ఇన్నాళ్లూ సర్ధుకుపోయామన్నారు. కానీ రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే సహించమని, రైతులతో కలిసి పోరాడతామన్నారు. బీజేపీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తమతో కలిసి ధర్నాకు కూర్చుంటావా? అని బండి సంజయ్‌ను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
పోరాటాలకు తాము భయపడమని, ప్రజల పక్షాన నిలబడి బీజేపీని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామని అన్నారు.
భారతదేశ చరిత్రలో తొలిసారి తెలంగాణలో దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకం 100 శాతం అమలవుతుందన్నారు. హుజురాబాద్‌లో ప్రతి ఇంటికీ దళిత బందు ఇస్తామని, కేంద్రానికి మనసుంటే దళిత బంధుకు నిధులివ్వాలని కేసీఆర్ అన్నారు.