ప్రముఖ సెర్చ్ ఇంజీన్ సంస్థ గూగుల్, దాని సంబంధిత సేవలు పనిచేయకపోవడంతో యూజర్లు గందరగోళంలో పడిపోయారు. ఆల్ఫాబెట్ సొంతమైన సెర్చ్ ఇంజన్ గూగుల్‌తో పాటు దాని స్ట్రీమింగ్, ఈమెయిల్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందంటూ చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. మానిటరింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెక్టెక్టర్ ఈ విషయాన్ని నివేదించింది. ఈ సమస్యకు గల కారణాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. దీనిపై గూగుల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
డౌన్‌డెక్టెక్టర్ అందించిన సమాచారం ప్రకారం గూగుల్, యూట్యూబ్, జీమెయిల్‌తో కొన్ని గూగుల్ ప్లాట్‌ఫారమ్‌లు సోమవారం సాయంత్రంనుంచి మొరాయించాయి. ఉత్తర అమెరికాలోని కొన్నిప్రాంతాల్లోకి లాగిన్ అయ్యేందుకు, వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలు తలెత్తాయంటూ ఫిర్యాదు చేసినట్లు డౌన్‌డెక్టర్ తెలిపింది. ఒక దశలో వెయ్యి మందికి పైగా వినియోగదారులు గూగుల్ సేవల అంతరాయంతో గగ్గోలు పెట్టారని తెలిపింది. దీంతో పాటు యూట్యూబ్ టీవీ , గూగుల్ డ్రైవ్‌తో కూడా వినియోగదారులు సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.