ఆర్టీసీ పై రంగంలోకి దిగిన ప్రభుత్వం

ఆర్టీసీ పై రంగంలోకి దిగిన ప్రభుత్వం

ఆర్టీసీ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపుతుందని చెప్పినా.. జేఏసీ వినకపోవడంపై త్రిసభ్య కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. విలీనంపై నిర్ణయానికి సమయం ఇవ్వాలని కోరినప్పటికీ, ఆర్టీసీ సంఘాలు వినిపించుకోలేదని త్రిసభ్య కమిటీ తెలిపింది. పండగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అధికారులు చెప్పారు. ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. అద్దె బస్సులను, అవసరమైతే స్కూల్ బస్సులను నడిపి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేస్తామంటోంది.

కార్మికులు సమ్మెకు వెళ్తే రవాణా శాఖ తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దిశానిర్ధేశం చేశారు. ప్రైవేట్‌ స్కూల్‌ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించారు. రోజుకు డ్రైవర్‌కు 1500, కండక్టర్‌కు వెయ్యి రూపాయలు ఇస్తారు. అద్దె బస్సులు యథాతథంగా తిప్పాలని డిసైడయ్యారు. రెగ్యులర్ గా తిరిగే పదివేల బస్సులు ఎక్కడా తగ్గకుండా చూడాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు.  ఓవైపు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతున్నప్పటికీ…. ప్రతిపక్షాలు, పౌర-ప్రజావేదికలతో కలిసి ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కడికక్కడ బస్సులు అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో బస్సులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.

మొత్తానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె దసరాకు ఊళ్లకు వెళ్లే ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలో ప్రతీరోజూ ఉద్యోగాలకు వెళ్లే వారికి తలనొప్పిలా తయారైంది. ఆర్టీసీ యూనియన్ నేతలు ఎంతమాత్రం తగ్గకపోవడంతో ప్రభుత్వమే రంగంలోకి దిగింది.