నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ వైద్యుడి భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రెడ్డి కాలనీలోని అహల్య అపార్ట్‌మెంట్‌లోని నివాసంలో దంత వైద్యురాలు శ్వేత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆమె భర్త బండారు కుమార్ పిల్లల వైద్య నిపుణులు. వీరికి తొమ్మిదేళ్ల కుమార్తె ఉంది. పట్టణంలో భార్యాభర్తలకు మంచి పేరు ఉంది. కుటుంబ కలహాలు కారణంగా తరచుగా ఇద్దరూ గొడవ పడుతూ ఉండేవారని ఇరుగుపొరుగు చెబుతున్నారు. మనస్పర్థల కారణంగానే శ్వేత జీవితంపై విరక్తి చెంది ఈ ఘటనకు పాల్పడ్డారు.
తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితోనే ఈ ఘటనకు పాల్పడుతున్నానంటూ డైరీలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్‌లో…తనకు భర్తతో జీవితాంతం కలిసి జీవించాలని ఉన్నా ఆ కోరిక తీరడం లేదని, తన పేరు మీద ఉన్న ఆస్తి పాస్తులు తన కూతురికి చెందాలని, తనకోసం ఎవరూ కేసులు పెట్టుకుని గొడవలు పడొద్దని డైరీలో రాశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా భార్య మృతదేహం చూసి డాక్టర్ కుమార్ భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.