ఆధునిక యూపీఎస్ (అన్ ఇంటరప్టబుల్ పవర్ సోర్స్) ఏర్పాటు కోసం ఈ నెల 9వ తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు ఆన్లైన్ సేవలు నిలిపివేస్తున్నట్లు స్టేట్ డేటా సెంటర్ (ఎస్డీసీ) ప్రకటించింది. 2010లో హైదరాబాద్ గచ్చిబౌలి టీఎస్ఐఐసీ సెంటర్లో నిర్మించిన ఎస్డీసీ 2011 నుంచి సేవలందిస్తోంది.
ఈ సెంటర్ నుంచి వివిధ ప్రభుత్వ విభాగాలు తమ యాప్లు, వెబ్సైట్లను ప్రారంభించాయి. ప్రభుత్వ, పౌర సేవల్లో ఈ ఎస్డీసీ కీలకపాత్ర పోషిస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా ప్రభుత్వ, పౌరసేవలు అందించేందుకు పాత యూపీఎస్ స్థానంలో ఆధునిక యూపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే సందర్భాల్లో కొత్త వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.