పచ్చని సంసారంలో ప్రేమ చిచ్చు పెట్టింది. భార్య, కుమార్తె ఉన్నప్పటికీ మరో యువతితో ప్రేమలో పడడంతో పచ్చని సంసారం ముక్కలైపోయింది. ప్రేమించిన యువతితో రెండో పెళ్లికి భార్య అంగీకరించకపోవడంతో విశాఖ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మద్దింశెట్టి సురేష్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎం పాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంపచోడవరం ప్రాంతానికి చెందిన సురేష్ 2009లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం విశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందిన సునీతతో 2016లో వివాహం జరిగింది. వీరికి 4 నెలల పాప ఉంది. మధురవాడ శివశక్తినగర్ రోడ్డులోని బ్లూ సిటీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో రెండేళ్లుగా నివసిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట భార్య పుట్టింటికి వెళ్లింది.
ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు భార్య సునీతకు సురేష్ చెప్పాడు. ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె అంగీకారం కోరగా ఆమె నిరాకరించి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సురేష్ ప్రేమిస్తున్న మహిళ సునీతకు బుధవారం ఫోన్ చేసి సురేష్‌ను తాను ప్రేమించడం లేదని చెప్పింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో భార్యకు సురేష్ ఫోన్ చేసి, తాను ప్రేమించిన మహిళ తనను తిరస్కరించిందని, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫొటో పంపించాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అప్రమత్తమైన సునీత ఎదుటి ప్లాట్‌లో నివసిస్తున్న వారికి విషయం చెప్పింది.
వారు ఇంటిలోకి వెళ్లి చూడగా అప్పటికే ఉరేసుకున్న సురేష్‌ను కిందకు దించి స్థానిక ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వారు చేర్చుకోకపోవడంతో అక్కడి నుంచి కేజీహెచ్‌కు తరలించడంతో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజోలు నుంచి తల్లిదండ్రులతో కలిసి గురువారం విశాఖ చేరుకున్న సునీత ఫిర్యాదు మేరకు పీఎం పాలెం క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త మృతిపై అనుమానాలు లేవని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.