Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇంతలో ఎంత మార్పు. నిన్నమొన్నటిదాకా కాస్త మెజారిటీ తగ్గుతుందేమో గానీ గుజరాత్ లో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని ఎన్నో సర్వే సంస్థలు ప్రకటించాయి. అయితే గత రెండు నెలల పరిణామాలు మొత్తం పరిస్థితిని మార్చేశాయి. లెక్కలు మొత్తం మారిపోయాయి. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగే పరిస్థితి వచ్చింది. లోక్ నీతి – csds – Abp న్యూస్ ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయి. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ చెరో 43 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలు అయ్యాయి.
ఇదే సంస్థ ఓ నాలుగు నెలల కిందట అంటే ఆగష్టు లో సర్వే చేసినప్పుడు బీజేపీ కి 59 శాతం ఓట్లు వస్తాయని ఫలితం వచ్చింది. నవంబర్ చివరి వారంలో ఆ సంస్థ మళ్ళీ ప్రజల అభిప్రాయం తీసుకుంది. గుజరాత్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కాక జరిపిన సర్వే లో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పడిపోయింది. 16 శాతం తగ్గిపోయింది. 43 శాతం మంది మాత్రమే బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు. ఇక ఆగష్టు సర్వే లో కేవలం 29 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్ బలం 14 శాతం పెరిగి 43 శాతానికి చేరింది.
ఈ నాలుగు నెలల వ్యవధిలో బీజేపీ ఓటు బ్యాంకు ఇంతగా దెబ్బ తినడానికి రెండు ప్రధాన కారణాలను విశ్లేషకులు ముందుకు తెస్తున్నారు. పటేల్ రిజర్వేషన్ ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు హార్దిక్ పటేల్ సెక్స్ సీడీలు విడుదల చేయడం వెనుక బీజేపీ హ్యాండ్ ఉందని గుజరాతీలు భావిస్తున్నారు. పటేల్ సామాజిక వర్గానికి చెందని వాళ్ళు కూడా ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఓ యువకుడిని రాజకీయంగా దెబ్బ తీయడానికి ఇంత అనైతిక చర్యలకు పాల్పడతారా అన్న భావన గుజరాతీల్లో వ్యక్తం అయ్యిందట. ఇక జీఎస్టీ మీద కూడా వ్యాపార వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందట. ఈ రెండు కారణాలతో బీజేపీ తగ్గుతున్న బలాన్ని మోడీ ప్రతిష్ట కూడా నిలబెట్టే అవకాశాలు లేవట. మొత్తానికి రాజకీయాల్లో హత్యలుండవు , ఆత్మహత్యలు తప్ప అన్న నానుడిని సెక్స్ సీడీలు చూపడం ద్వారా బీజేపీ కూడా నిజం చేసింది అన్నమాట.