టీడీపీకి షాక్…గుర్నాధ్‌రెడ్డి రాజీనామా..!

Gurunath Reddy Resigns TDP

అనంతపురం జిల్లా అనంతపురమం మాజీ ఎమ్మెల్యే జి.గుర్నాథరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ జగన్ కు అత్యంత  సన్నిహితంగా వ్యవహరించిన గుర్నాథ్ రెడ్డి గత ఏడాది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పోటీ చేసి ఆయన టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతలో బలమైన అనుచరగణం ఉన్న ఆయన జేసీ దివాకర్ రెడ్డి చొరవతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒక్క జేసీ మినహా మిగతా టీడీపీ నేతలందరూ గుర్నాథ్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించినా గుర్నాథ్ రెడ్డి సీటు అడగడం లేదనే ఏకైక కారణంతో పార్టీ మారు మాట్లాడకుండా చేర్చుకుంది. కొద్ది రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి అలక పాన్పు ఎక్కినసంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ సమయంలో అప్పుడు ఆయన హైకమాండ్ ముందు ఉంచిన డిమాండ్లలో గుర్నాథరెడ్డికి పదవి ఇవ్వడం కూడా ఒకటని ప్రచారం జరిగింది. అప్పట్లో చంద్రబాబు ఏం హామీ ఇచ్చారో ఆయన అలక వీడారు అయినా గుర్నాథ్ రెడ్డికి మాత్రం పదవి రాలేదు. గుర్నాథ్ రెడ్డి పార్టీ లోనే ఉన్నా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప చౌదరి ఆయనను కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే వీరికి జేసీతో పడదు అయితే ఈ అంతర్గత విభేదాలు తీవ్రమవడంతో గుర్నాథ్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. గుర్నాథ్ రెడ్డి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేసి బయటకు వచ్చారు. ఇక గుర్నాధ్ రెడ్డికి ఉన్న ఆప్షన్స్ జనసేన, కాంగ్రెస్ మాత్రమె, ఆయితే ఆయన ఏ విషయాన్ని ప్రకటించలేదు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.