Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లవ్ జీహాద్ కేసులో సుదీర్ఘన్యాయపోరాటం చేసిన హదియా నష్టపరిహారం డిమాండ్ చేస్తోంది. కేరళరాష్ట్రప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించాలని హదియా కోరుతోంది. కేరళ హైకోర్టు తన పెళ్లిని రద్దుచేసిన తర్వాత తాను చాలా నష్టపోయానని, తన తల్లిదండ్రులకు దూరమయ్యానని ఆవేదన వ్యక్తంచేసింది. తాను అక్షరాలా గృహనిర్బంధానికి గురయ్యానని, రెండున్నరేళ్లపాటు తాను న్యాయపోరాటం చేశానని, తన జీవితంలో రెండేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయానని ఆమె వాపోయింది. తాను తన తల్లిదండ్రుల నుంచి నష్టపరిహారం కోరినట్టు మీడియాలో వార్తలొచ్చాయని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని హదియా వెల్లడించింది. తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతున్నానని స్పష్టంచేసింది. తన తల్లిదండ్రులు తనకు హాని తలపెడతారని తాను భావించడం లేదని, కానీ వారు కొంతమంది జాతి వ్యతిరేక శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని ఆరోపించింది.
హిందూ మతానికి చెందిన హదియా ముస్లింయువకుడైన సఫిన్ జహాన్ ను ప్రేమించి పెళ్లిచేసుకుని ఆ తర్వాత పేరు, మతం మార్చుకుంది. ఈ వివాహాన్ని ఆమోదించని ఆమె తల్లిదండ్రులు సఫిన్ జహాన్ తమ కుమార్తెను మోసం చేసిపెళ్లిచేసుకున్నాడని, ఇది లవ్ జీహాద్ కిందకు వస్తుందని ఆరోపిస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన కేరళ హైకోర్టు గత ఏడాది మేలో హదియా పెళ్లిని రద్దుచేసి ఆమె తల్లిదండ్రుల వద్దే ఉండాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సఫిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… అత్యున్నత న్యాయస్థానంలో హదియాకు అనుకూలంగా తీర్పువెలువడింది. కేరళ హైకోర్టు తీర్పును పక్కనబెట్టిన సుప్రీంకోర్టు హదియా వివాహాన్ని పునరుద్ధరించి… ఆమె తన భర్తతో కలిసుండొచ్చని తీర్పు ఇచ్చింది.