Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సింగపూర్ అధ్యక్షురాలిగా ముస్లిం మాలే మైనార్టీకి చెందిన హలీమా యాకూబ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సింగపూర్ కు హలీమా తొలి మహిళా అధ్యక్షురాలు. గతంలో హలీమా పార్లమెంట్ స్పీకర్ గా పనిచేశారు. విభిన్న సంస్కృతుల మేళవింపుగా కనిపించే సింగపూర్ లో ఈ సారి అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వాన్ని మైనార్టీగా ఉన్న మలయ్ కమ్యూనిటీకి చెందిన వారికి రిజర్వ్ చేశారు. ఎన్నికల కోసం హలీమాతో సహా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. వారిలో ఇద్దరు మలై కమ్యూనిటీకి చెందిన వారు కాకపోవడం, మరో ఇద్దరు అర్హత పత్రాలు సమర్పించని కారణంగా వారి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో హలీమా ఎన్నిక ఏకగ్రీవం అయింది. రిజర్వ్డ్ ఎన్నిక ద్వారా తాను అధ్యక్ష పీఠం అధిరోహిస్తున్నా..తాను మాత్రం రిజర్వ్డ్ అధ్యక్షురాలిని కాదని, అందరి అధ్యక్షురాలిని అని హలీమా తన ప్రసంగంలో చెప్పారు. మరోవైపు హలీమా ఎన్నికపై విమర్శల వర్షం కురుస్తోంది.
అత్యంత కీలకమైన అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించకుండా హలీమాను ఎలా పీఠం ఎక్కిస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అర్హతా నియమాలు పాటించకుండానే ఆమెను అధ్యక్షరాలుగా నియమించారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. సింగపూర్ లో కొన్ని దశాబ్దాలుగా పీపుల్స్ యాక్షన్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. పార్టీలోని వివిధ కమ్యూనిటీలకు దఫాల వారీగా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తోంది. ఆ క్రమంలోనే ఈ సారి మాలే వర్గానికి కేటాయించింది. అయితే ఎవరికి అధ్యక్షపదవి ఇవ్వాలనే విషయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్షాంగా హలీమాకు కట్టబెట్టారని…ఆ వర్గానికే చెందిన కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ సింగపూర్ అధ్యక్ష ఎన్నికలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలు లేకుండా అధ్యక్షురాలి ఎన్నిక…ఇదొక హాస్యాస్పదం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
మరిన్ని వార్తలు: