హమాస్-ఇజ్రాయెల్‌ల మధ్య భీకర యుద్ధం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ యుద్ధంలో సామాన్య ప్రజలు ముఖ్యంగా చిన్నారులు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులతో అక్కడ మారణహోం జరుగుతోంది. ఈ నరమేధంలో ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలు బలవుతున్నాయని ప్రపంచ దేశాలు ఆవేదన చెందుతున్నాయి. ఇరు దేశాలు వీలైనంత త్వరగా యుద్ధం ఆపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
అయితే హమాస్‌ను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతున్న వేళ భారత్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజల మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ చట్టాలు అమలు చేయాల్సి ఉందని సూచించింది. ఇరు దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని పేర్కొంది. అదే విధంగా పాలస్తీనా ప్రజలకు మానవతా సాయం పంపే విషయంపై భారత్ ఆలోచిస్తోందని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు. గాజా సిటీలోని అల్-షిఫా ఆస్పత్రిలో ఇజ్రాయెల్ ఆపరేషన్‌పై ఆయన మాట్లాడుతూ.. సమస్య ఒక్క ఆల్-షిఫా ఆస్పత్రి గురించి కాదని, అంతర్జాతీయ చట్టాలు అమలు చేసి ప్రజల మరణాలను నివారించాలని భారత్ భావిస్తోందని తెలిపారు.