తీవ్ర స్థాయిలో మండిపడ్డ హర్భజన్

తీవ్ర స్థాయిలో మండిపడ్డ హర్భజన్

ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టులో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు ఇవ్వకపోవడంపై హర్భజన్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇప్పటికే గాయాన్ని సాకుగా చూపి రోహిత్‌ శర్మను పక్కకు పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రాగా, సూర్యకుమార్‌ను పరిగణలోకి తీసుకోలేకపోవడాన్ని భజ్జీ ఖండించాడు. ఈ మేరకు ట్వీటర్‌ వేదికగా టీమిండియా సెలక్షన్‌ తీరును విమర్శించాడు.

‘ సూర్యకుమార్‌ ఇంకేమి నిరూపించుకోవాలో తెలియడం లేదు. అతన్ని టీమిండియా జట్టులో ఎంపికయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. సూర్యకుమార్‌ ప్రతీ ఐపీఎల్‌లో రంజీ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నాడు. మన సెలక్షన్‌ కమిటీలో ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన రూల్‌ను అవలంభిస్తున్నారు. ఇందుకు ఇదే నిదర్శనం. సెలక్టర్లు.. కనీసం అతని రికార్డులను చూడండి. ఇది నా రిక్వెస్ట్‌’ అని భజ్జీ తెలిపాడు.

టెస్టు, వన్డే, టీ20 జట్టులను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ సోమవారం ఎంపిక చేసింది. కాగా, రోహిత్‌ శర్మకు అటు టెస్టు జట్టులో కానీ ఇటు వన్డే జట్టులో కానీ చోటు దక్కలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌కు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులో చోటు కల్పించలేదని బీసీసీఐ తెలిపింది. రోహిత్‌ గాయాన్ని బీసీసీఐ మెడికల్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది. మరొకవైపు ఇషాంత్‌ శర్మకు సైతం స్థానం కల్పించలేదు.

గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడమే ఇందుకు కారణం. ఇషాంత్‌ గాయాన్ని కూడా బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ పర్యవేక్షిస్తోంది. మరొకవైపు టెస్టు జట్టులో మాత్రమే రిషభ్‌ పంత్‌ అవకాశాన్ని ఇచ్చారు. వన్డేలకు, టీ20లకు పంత్‌కు చోటు దక్కలేదు. టీమిండియా టెస్టు జట్టులో వృద్ధిమాన్‌ సాహాకు అవకాశం ఇచ్చారు. ఇక కేకేఆర్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్‌ వరుణ్‌ చక‍్రవర్తికి తొలిసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కింది. మహ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌లకు టెస్టు జట్టులో చోటు దక్కింది.