Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కేంద్ర బడ్జెట్ తర్వాత ఏపీలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమై రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో మౌనం దాల్చిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు స్పందించారు. ఏపీకి చెప్పింది చేస్తున్నామని, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన 27 పేజీల నోట్ విడుదల చేశారు. ఏపీకి కేంద్రం మంజూరు చేసిన జాతీయ సంస్థలు, ప్రాజెక్టులు, నిధులు గురించిన వివరాలు ఇందులో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటికే రూ.4వేల కోట్లకు పైగా అందించిందని హరిబాబు చెప్పారు. మోడీ ప్రభుత్వం తొలి క్యాబినెట్ భేటీలోనే పోలవరానికి సంబంధించిన 7 మండలాలపై నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
పోలవరం విషయంలో మోదీకి ఉన్న చిత్తశుద్ధిని ఇంతకంటే రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత తనదంటూ నితిన్ గడ్కరీ హామీఇచ్చారని తెలిపారు. ఏపీకి సంబంధించి ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఏపీలో గిరిజన యూనివర్శిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కేంద్రం అంగీకరించిందని, రెండు విశ్వవిద్యాలయాలకు రూ. 10 కోట్ల చొప్పున ఇచ్చిందని, కడప స్టీల్ ప్లాంట్ పై కూడా దృష్టి పెట్టిందని చెప్పారు. ఉజ్వల్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ పథకాల వినియోగంతో ఏపీలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరా అవుతోందని, 2014 కంటే ముందు కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో విద్యుత్ కోతలు ఉండేవని, ఇప్పుడు ఆ సమస్యలు లేవని చెప్పారు.
ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రానికి ఎంతమేర లాభం చేకూరుతుందో…అంతమేర ఒక్క రూపాయి తగ్గకుండా ప్రత్యేక ప్యాకేజీ అమలుచేస్తామని కేంద్రం ప్రకటించిందని, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. నాబార్డ్ ద్వారా ఎప్పుడు అవసరమైతే అప్పుడు నిధులు తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐదేళ్లకు సంబంధించి రెవెన్యూ లోటు దాదాపు 22 వేల కోట్ల రూపాయలు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూనే ఉందని తెలిపారు. ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందనే విషయంపై చర్చలు జరుగుతున్నాయని, మిగిలిన రెవెన్యూ లోటును కూడా కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు.
దుగరాజు పట్నం పోర్టు ఏర్పాటుకు పలు అభ్యంతరాలు వచ్చాయని…దీంతో ప్రత్యామ్నాయ పోర్టు సూచించాలని ఏపీని కేంద్రం కోరిందని చెప్పారు. విశాఖ రైల్వేజోన్ కోసం కమిటీ ఏర్పాటుచేశామని, రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపడుతోందని హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటీవల కొన్ని రాజకీయ పార్టీలు బంద్ పాటించాయని, చట్టాన్ని రూపొందించి ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో పెట్టని వాళ్లు కూడా బంద్ లో పాల్గొన్నారని వారు పరోక్షంగా కాంగ్రెరస్ ను ఉద్దేశించి విమర్శించారు. ఏపీ ప్రజల గొంతు కోసింది కాంగ్రేసేనని బీజేపీ మరో నేత నరసింహారావు ఆరోపించారు. బీజేపీపై కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, ఏపీకి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిచేస్తున్న బీజేపీపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఏపీవల్లే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీ ప్రజల్నే మోసం చేసిందని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని నరసింహారావు మండిపడ్డారు.