Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉమ్మడి రాష్ట్రంలోనూ, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కొన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ… ఇప్పుడు మాత్రం మిత్రపక్షాల్లా వ్యవహరిస్తున్నాయి టీడీపీ, టీఆర్ఎస్. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరిపట్ల మరొకరు సుహృద్భావంతో మెలుగుతున్నారు. రెండు రాష్ట్రాల నేతలు కూడా ఒకరినొనరు పన్నెత్తు మాట అనుకోవడం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితులను చూసి తెలంగాణలో టీడీపీ, టీఆర్ఎస్ ఎన్నికల పొత్తు పెట్టుకుంటాయన్న ఊహాగానాలు తలెత్తాయి. వాటి వెంట టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ మారే ప్రయత్నం హాట్ టాపిక్ గా నిలిచింది.
ప్రస్తుతం వాటన్నింటికీ తెరపడినప్పటికీ… టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు, నేతల తీరులో ఏ మార్పూ రాలేదు. గతంలోలానే… రెండు తెలుగు రాష్ట్రాలు… సోదరభావం కనబరుస్తున్నాయి. అయితే హఠాత్తుగా తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఏపీ ప్రభుత్వంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కావాలని కాకపోయినా… కాంగ్రెస్ ను విమర్శించే క్రమంలో హరీశ్ రావు ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమవేశాలు జరగనున్నాయి. రైతులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్… ఛలో అసెంబ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై స్పందించిన హరీష్ రావు ప్రజాసమస్యలపై చర్చించుకుందామంటే ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. అసెంబ్లీని ముట్టడిస్తామనడం కాంగ్రెస్ అసహన రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీడీపీ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు.
పక్క రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతోందో అందరికీ తెలుసని, ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడే మైక్ కట్ చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తెలంగాణ లో తాము మాత్రం టీడీపీలా చేయడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కు మాట్లాడే అవకాశం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేతల దగ్గర సరుకు, సబ్జెక్టు లేవని, తాము చర్చలకు సిద్ధమని చెబుతున్నా… కాంగ్రెస్ మాత్రం వీధిపోరాటాలు చేస్తామంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఏపీ అసెంబ్లీసమావేశాలు… హరీష్ రావు చెప్పినట్టుగా ఏమీ లేవని, అధికార పక్షంతో సమానంగా ప్రతిపక్షానికి అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం కేటాయిస్తున్నారని, మూడేళ్లగా తాము దీన్ని గమనిస్తూనే ఉన్నామని వారు అభిప్రాయపడుతున్నారు. అయినా ఏపీ వ్యవహారాలపై హరీష్ రావు ఎందుకు విమర్శలు చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. హరీష్ రావు చెప్పినట్టుగా ఏపీ అసెంబ్లీ సాగితే… ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ ఇప్పటిదాకా ప్రతిపక్షనేత జగన్ గొంతును అసెంబ్లీ సమావేశాల్లో వినుండే వారుకాదు… కానీ ఈ మూడేళ్ల కాలంలో సీఎం చంద్రబాబు కన్నా జగన్ గొంతే అసెంబ్లీ లో ఎక్కువగా వినపడుతోంది. అసలు సంగతి ఇలా ఉంటే… హరీష్ రావు… ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం ఎందుకో అర్ధం కావడం లేదు.