Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పేరుతో కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవ అమెరికా కాంగ్రెస్ దృష్టికీ వెళ్లింది. పుస్తకం తర్వాత కంచె ఐలయ్యను, బెంగళూరులో హత్యకు గురైన మహిళా జర్నలిస్టు గౌరీ లంకేశ్ తో పోలుస్తూ వ్యాఖ్యానాలు వినిపించాయి. గౌరీ లంకేశ్ లానే తననూ కాల్చి చంపుతారేమోనని కంచె ఐలయ్య పలుమార్లు భయాందోళన వ్యక్తంచేశారు కూడా. ఐలయ్య, ఆయన మద్దతుదారులే కాదు… అమెరికన్ ప్రతినిధుల సభ కూడా ఈ రెండు విషయాలకూ సంబంధముందని భావిస్తోంది.
రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి హెరాల్డ్ ట్రెంట్ ఫ్రాంక్స్ ఈ విషయాలను కాంగ్రెస్ సభలో ప్రస్తావించారు. ఇప్పటికే జరిగిన ఓ హత్యను కానీ, మరో హత్య చేస్తామన్న బెదిరింపులును గానీ భారత్ ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని ట్రెంట్ ఫ్రాంక్స్ ఆరోపించారు. భారత్ లో మాట్లాడే స్వేచ్ఛ నశిస్తోందని, సోషల్ మీడియాలో తమ అభిప్రాయం చెప్పిన వారు సైతం శిక్షలకు గురవుతున్నారని హెరాల్డ్ ఆరోపించారు. ఓ మహిళాజర్నలిస్టు తన ఇంటి ముందే హత్యకు గురై నెలరోజులు గడుస్తున్నా… నిందితులను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న ఘటనలు భారత్ లో జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల పరిధిలో అధికారం కోసం జరుగుతున్న వర్గపోరులో భాగంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. గోవింద్ పనేసర్, ఎంఎం కాల్ బుర్గీ, నరేంద్ర దబోల్కర్ హత్యలనూ హెరాల్డ్ ప్రస్తావించారు.
అదే సమయంలో ఐలయ్య అంశాన్నీ, ఆయనకు హెచ్చరికలు చేసిన టీడీపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలనూ హెరాల్డ్… ప్రతినిధుల సభకు వివరించారు. ఓ కులం సామాజిక పెత్తనం గురించి రాసిన ఐలయ్య అనే ప్రొఫెసర్ ను బీజేపీ మిత్రపక్షంలోని ఓ ఎంపీ బహిరంగంగా ఉరితీస్తానని హెచ్చరించాడని ఫ్రాంక్ గుర్తుచేశారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఐలయ్య పుస్తకంపై జరుగుతున్న గొడవను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నమాట. బీజేపీ మిత్రపక్షం అంటే టీడీపీనే… ఐలయ్య పుస్తకాన్ని ఖండించే క్రమంలో ఇలాంటి రాతలు రాసిన వారిని అరబ్ దేశాల్లో బహిరంగంగా ఉరితీస్తారని, ఐలయ్యను కూడా అలాగే శిక్షించాలని టీడీపీ నేత టిజీవెంకటేశ్ డిమాండ్ చేశారు. అమెరికా ప్రతినిధుల సభలో హెరాల్డ్ మాట్లాడింది ఈ హెచ్చరికల గురించే. ప్రజా ప్రతినిధులే భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, దీనిని అరికట్టేందుకు భారత్ పై ఎలా ఒత్తిడి పెంచాలన్న విషయమై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ప్రతినిధుల సభకు హెరాల్డ్ విన్నవించారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఆరిజోనా 8వ జిల్లాకు హెరాల్డ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.