Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ ఆశ్రమంలో జరిగిన దారుణాలు మర్చిపోకముందే దేశరాజధానిలోనూ ఆ తరహాలోనే ఓ ఆశ్రమ నిర్వాకం వెలుగుచూసింది. భగవంతుడి గురించి బోధిస్తామని చెప్పి అమ్మాయిలను తీసుకొచ్చి ఆశ్రుమంలో వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. మైనర్లు, మేజర్లు అన్న తేడా లేకుండా అమ్మాయిలు, మహిళలపై లైంగిక దాడులకు తెగబడుతున్నారు. ఈ చిత్రవధను భరించలేక కొందరు అమ్మాయిలు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. ఓ ఎన్జీవో పిటిషన్ తో ఈ దారుణం గురించి బయటి ప్రపంచానికి తెలిసింది.
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ అనే ఆశ్రమం ఉంది. భగవంతుడి బోధనల పేరుతో అమ్మాయిలను ఇక్కడకు తీసుకువస్తారు. ఒక్కసారి ఈ ఆశ్రమంలో అడుగుపెడితే ఇక బందీగా మారినట్టే. ఇక కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు అవకాశం ఉండదు. ఇనుపగ్రిల్స్ లో జంతువుల మాదిరిగా వారిని బంధిస్తారు. కనీసం ఒంటరిగా స్నానంచేసేందుకు కూడా వారికి అనుమతి లేదు. అక్కడున్న అమ్మాయిలు, మహిళలపై సాధువులు నిత్యం లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ అకృత్యాలను భరించలేక ఆశ్రమంలో కొందరు అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దురాగతాలను తెలుసుకున్న స్థానిక ఎన్జీవో అనేకమార్లు పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆ ఎన్జీవో ప్రతినిధులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తక్షణమే ఆశ్రమంలో సోదాలు నిర్వహించాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశ్రమాన్ని తనిఖీ చేయగా దారుణ విషయాలు వెలుగుచూశాయి. ఆశ్రమంలో వందమందికి పైగా అమ్మాయిలు బందీలుగా ఉన్నారు. వారిలో ఎక్కువమంది మైనర్లే. ఆశ్రమంలో మహిళలంతా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, అక్కడ వారిని జంతువుల్లాగే చూస్తున్నారని స్వయంగా పోలీసులే కోర్టుకు విన్నవించారు. పోలీసుల వాదనలు విన్నతర్వాత ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 15 రోజుల్లో ఇందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించింది. సీబీఐ దర్యాప్తులో ఆశ్రమం గురించి మరిన్ని కళ్లు చెదిరే నిజాలు తెలుస్తాయని ఎన్జీవో ప్రతినిధులు అంటున్నారు.