రోడ్డు ప్రమాదంలో పోలీసు హెడ్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి, మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో నివసించే ఈశ్వరయ్య ప్రస్తుతం శంషాబాద్ పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి విధులు పూర్తి చేసుకొని తన వాగన్ఆర్ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు.
ఈ క్రమంలో ఈశ్వరయ్య వాహనం కూకట్పల్లి ఫోరం మాల్ వంతెనపై ఎదురుగా ఉన్న టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈశ్వరయ్యకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఈశ్వరయ్య మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.