సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుక

సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుక

సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త అందించారు. సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 29 శాతం వాటాను ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది ఇచ్చిన 28 శాతం కంటే ఒక శాతం పెంచుతూ సింగరేణి కార్మికులకు సీఎం దసరా కానుకను ప్రకటించారు. ఈ సొమ్మును పండగ కంటే ముందే చెల్లించాలని సీఎండీ శ్రీధర్‌ని ఆదేశించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో సింగరేణిపై సీఎం సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సింగరేణి కార్మికుల నైపుణ్యాన్ని బొగ్గు తవ్వకంలోనే కాకుండా ఇసుక, సున్నపురాయి, ఇనుము తదితర ఖనిజాల తవ్వకాల్లో వినియోగించుకోవాలన్నారు.

లాభాలు వచ్చే అవకాశమున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేట్‌ పరం చేస్తుండడం దారుణమన్నారు. సింగరేణిలో పనిచేసి పదవీ విరమణ పొందిన కార్మికులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా అందుతున్న పింఛను రూ.2 వేలలోపే ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.