కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పూర్తిగా పోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రానున్న మూడు నెలలు పండగల సీజన్ అని.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదని.. ఎవరికైనా లక్షణాలు ఉంటే తప్పకుండా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పండగల సీజన్లో షాపింగ్లు, విందులకు వెళ్లేవాళ్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలన్నారు. వైరస్ పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కుటుంబంలో అందరికీ సోకుతుందని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు చాలా పెరిగిందని తెలిపారు. దాదాపు ప్రస్తుతం కరోనా ముందు పరిస్థితులు కనిపిస్తున్నాయని, సాధారణ జీవనంలోకి వస్తున్నామన్నారు.
డిసెంబర్ వరకు మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరని, ప్రజలంతా మాస్క్లు ధరించాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.01కోట్ల మందికి కనీసం ఒక డోసు, 38 శాతం మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. రెండు డోసులు తీసుకుంటేనే కొవిడ్-19 మహమ్మారి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు.