పిల్లలకి రోజూ ఇవి తినిపించాల్సిందే… ఎందుకంటే !

Healthy Food for Childrens

పిల్లలకి ఆటపాటల మీద ఉన్న ఆసక్తి ఇతరత్రా దేని మీదా ఉండదు. తిండిని కూడా అంతగా పట్టించుకోరు. ఎదుగుతున్న పిల్ల‌ల‌కు నిత్యం అన్ని పోష‌కాలు ఉన్న పౌష్టికాహారాన్ని ఇవ్వాల‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. కానీ త‌ల్లిదండ్రులు మాత్రం అలా చేయ‌లేక‌పోతుంటారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. పిల్ల‌లు స‌ద‌రు ఆహారాన్ని తిన‌లేమ‌ని మొండికేస్తారు. ఇక కొంద‌రు పిల్ల‌లు అయితే నిత్యం ఒకే ర‌క‌మైన ఆహారాన్ని తింటారు. ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలు అన్నీ ఉన్నాయా, లేదా అని చూసుకుని మ‌రీ పిల్ల‌ల‌కు భోజ‌నం పెట్టాలి. దీంతో వారు శారీర‌కంగా, మాన‌సికంగా చ‌క్క‌గా ఎద‌గడ‌మే కాదు, చ‌దువుల్లో, ఇత‌ర అంశాల్లోనూ రాణిస్తారు. పిల్ల‌ల‌కు రోజూ ఇవ్వాల్సిన పౌష్టికాహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్: ఎదిగే పిల్లలకు ఓట్స్ చాలామంచివి. తక్షణ శక్తినివ్వడంలో వీటిలోని పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. పీచూ, కార్బోహైడ్రేట్లూ ఉత్సాహంగా ఉండటానికి దోహదం చేస్తాయి. బడికి వెళ్లే ముందూ లేదంటే సాయంత్రం వచ్చాకా అల్పాహారంగా ఓట్స్ ఇవ్వాలి. జావగా తాగడానికి చాలామంది చిన్నారులు ఇష్టపడరు. అలాంటప్పుడు కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసి పైన చెర్రీలూ, చాకోస్, చాక్లెట్ పలుకులూ ఉంచితే ఇష్టంగా తింటారు.

చేపలు: పిల్లలకు వారానికోసారైనా చేపలు తినిపించాలి. వీటిల్లోని ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేస్తాయి. కుంగుబాటూ, ఒత్తిడి వంటి వాటిని దూరం చేస్తాయి. గర్భిణిగా ఉన్నప్పుడు చేపలు తింటే పుట్టే పిల్లలు చురుగ్గా ఉంటారని ఇప్పటికే చాలా అధ్యయనాలు రుజువు చేశాయి.

గుడ్లు: ఆటల్లో చురుగ్గా ఉండే చిన్నారులకు ప్రొటీన్లు లభించే ఆహారం ఇవ్వాలి. గుడ్లలో ప్రొటీన్ల శాతం ఎక్కువ. అల్పాహారంలో రోజుకో గుడ్డు తినిపించాలి. ముక్కలుగా చేసి మిరియాలపొడీ, ఉప్పూ చల్లి ఇవ్వొచ్చు.

నీళ్లు: చిన్నారులకి ఎన్ని నీళ్లు తాగిస్తే అంత మంచిది. అందులో కాస్త నిమ్మరసం వేస్తే విటమిన్ ‘సి’ అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అరటి పండు: చదువుకొనే పిల్లలకు జ్ఞాపకశక్తి అవసరం. అది మెరుగుపడాలంటే పొటాషియం ఎక్కువగా అందేలా చూడాలి. అరటిపండ్లూ, ఆప్రికాట్‌లో పొటాషియం శాతం అధికం. చిన్నారులకు ఉదయం సాయంత్రం అరటి పండు తినిపిస్తే మంచిది. రోజూ పండు చేతికిచ్చే బదులు ఒక్కోసారి ముక్కల మీద క్రీమ్ చల్లి ఇవ్వొచ్చు.