తెలుగోళ్ళకే గుండె పోటులు ఎక్కువట…!

Heart-Attacks-Becoming-High

ఏపీ, తెలంగాణ ప్రజలు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో తేలింది. హార్వర్డ్ యూనివర్సిటీ, పాపులేషన్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పరిశోధకులు సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఈ అధ్యయం చేపట్టారు. గుండె జబ్బుల ముప్పు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో తక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం. తెలంగాణలో పురుషుల్లో గుండె జబ్బుల రిస్క్ 20.3 శాతం ఉండగా మహిళల్లో 8.3 శాతమని తేలింది. కానీ ఏపీలో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పురుషుల్లో హృదయ సంబంధ వ్యాధుల ముప్పు 24.2 శాతం కాగా, మహిళల్లో 12.7 శాతంగా ఉంది.

Heart-Attacks

దేశవ్యాప్తంగా 30 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న 7,97,540 మందిపై అధ్యయనం నిర్వహించారు. తెలంగాణలో 34.7 శాతం మంది పురుషులకు ధూమపానం అలవాటు ఉందని, దీని వల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయని సర్వే తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు, హర్యానా, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత తెలంగాణలోనే పురుషులు ఎక్కువగా పొగ తాగుతున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వయసు, బీఎంఐ, డయాబెటిస్, స్మోకింగ్, బీపీ తదితర అంశాల ఆధారంగా గుండె జబ్బుల ముప్పును అంచనా వేశారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నం, గోధుమలను ఆహారంగా తీసుకోవడం, రీడీఫైన్డ్ షుగర్ వల్ల బీఎంఐ ఎక్కువ అవుతోంది. అలాగే మద్యం తాగడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.