Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరకొరియా, అమెరికా మధ్య పరిస్థితులు రోజురోజుకీ దిగజారిన నేపథ్యంలో అమెరికా ప్రపంచదేశాలను ఈ సమస్యలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతోంది. ఆ క్రమంలో అమెరికాతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్ ను ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచాలని కోరింది. భారత ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికాకు చక్కని అనుబంధం ఉందని, ఉత్తరకొరియాపై ఒత్తిడితేగల దేశాలపై తమ విస్తృత చర్చల్లో పరిశీలించామని అమెరికా అధికార ప్రతినిధి హేథర్ నౌవర్ట్ తెలిపారు. ఉత్తరకొరియా ప్రపంచ ముప్పుగా పరిణమించిందని, ఈ అంశంపై భారత్ తమకు మరింత సాయం చేయగలదని ఆశిస్తున్నామని, భారత ప్రభుత్వంతో ఈ తరహా చర్చలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అలాగే ఉత్తరకొరియాతో ప్రత్యేక ఆర్థిక సంబంధాలు ఉన్న చైనా, రష్యాను కూడా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని కోరుతున్నామన్నారు. దీనిపై చైనాతో చర్చలు జరుపుతున్నామని, ఈ ఏడాది ఇప్పటికే నాలుగుసార్లు చర్చించామని, అధ్యక్షుడు ట్రంప్ తో పాటు ప్రభుత్వ కార్యదర్శి బీజింగ్ లో ఆ దేశాధినేతలతో సమావేశమయ్యారని హేథర్ వెల్లడించారు.
ఉత్తరకొరియాపై చాలా దేశాలు ఒత్తిడి తేగలవని, అయితే చైనాపై తమకు ఎక్కువ నమ్మకముందని తెలిపారు. రష్యా, చైనా సమక్షంలోనే ప్యాంగ్యాంగ్ పై ఆంక్షలు విధించామని చెప్పారు. 20 కన్నా ఎక్కువ దేశాలు ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచుతున్నాయని, ఆ దేశం నుంచి దౌత్యవేత్తలు, అధికారులను వెనక్కి రప్పిస్తున్నాయని, ఒత్తిడి ప్రక్రియ ఇలాగే కొనసాగుతుందని హేథర్ వెల్లడించారు. అటు ఈ వివాదం నేపథ్యంలో రష్యా మాత్రం అగ్రరాజ్యానికి షాకిచ్చింది. ఉత్తరకొరియాతో తమ బంధాన్ని తెంచుకునేది లేదని, కిమ్ జాంగ్ ఉన్ తమకు మంచిమిత్రుడని రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రంప్ కు స్పష్టంచేశారు. ఉత్తరకొరియాతో సంబంధాలు తెంచుకోవాలని, ఆ దేశానికి ఆర్థిక, రాజకీయ సహకారాన్ని అందించవద్దని కోరుతూ ట్రంప్ పుతిన్ ను ఫోన్ లో కోరారు. ట్రంప్ విజ్ఞప్తిని పుతిన్ తోసిపుచ్చారు. అమెరికా చర్యలు ఉత్తరకొరియాను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించిన పుతిన్ ఇప్పటికే ఆ దేశంపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయని, అంతకు మించిన ఆంక్షలు అవసరం లేదని తేల్చిచెప్పారు. పుతిన్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న ట్రంప్ ఉత్తరకొరియాను దారిలోకి తేవడానికి చైనానే ప్రయోగించాలని నిర్ణయించుకున్నారు.