ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా, అల్పపీడనం ప్రభావంతో జోరుగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15వ తేదీ లోపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
దీనివల్ల రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.అల్పపీడనం ప్రభావం వల్ల ఈ నెల 17వ తేదీ వరకు ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అధికారులు వెల్లడించారు. ఇక ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉంది.
దీని ప్రభావం వల్ల రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం వివరించింది. ఇక, శనివారం విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.