నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రెండు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. దీంతో మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులను తలపిస్తున్నాయి.
మాదాపూర్‌లో, కూకట్ పల్లి ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. మదాపూర్, జూబ్లీహిల్స్‌లలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా వర్షం కురిసింది. ఈ ప్రాంతాల్లో నాలుగు గంటల్లోనే 70 మి.మీ.కు పైగా వర్షపాతం కురిసింది. ఐటీ సంస్థలు ఉన్న మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్‌లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. ఓ మాదిరి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంపై ఇప్పటికీ వ్యాపించి ఉన్నాయన్నారు. అక్టోబర్ రెండో వారానికి ఇవి వెనక్కి మళ్లుతాయని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.