నేపాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేని ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా నేపాల్లో ఇప్పటి వరకు మరణించిన వారిసంఖ్య 132కు చేరుకోగా 128 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. మరో 53 మంది గల్లంతయ్యారని తెలిపారు. ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో స్థానిక పాఠశాల భవనాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తలదాచుకున్నారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామన్నారు. గల్లంతైన వారి జాడ కోసం అన్వేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. టెరాయ్ ప్రాంతంలో అల్ప పీడనం కారణంగా భారీగా వర్షపాతం నమోదవుతుందని నేపాల్ వాతావరనణ విభాగం వెల్లడించింన సంగతి తెలిసిందే. లోతట్లు ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. కాగా పరిస్థితిపై సమీక్షిస్తున్న అధికారులు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.