ఇవాళ, రేపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం కొనసాగుతుండటంతోపాటు ఉత్తర మధ్యప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని. ఫలితంగా వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో ఈనెల 26న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో కోస్తా, రాయలసీమల్లోని ఎక్కువ ప్రాంతాల్లో బుధవారం ఆకాశం నిర్మలంగా ఉంది.
దీంతో ఎండ తీవ్రత కొనసాగింది. నెల్లూరులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు పూర్తి జలదిగ్బందంలోనే ఉన్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు లేకుండా రహదారులు తెగిపోయాయి. నిన్న ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు.