హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో నిత్యం వాహనాల రద్దీ చూస్తుంటే అమ్మో అనక మానరు. కిక్కిరిసిన రహదారులు.. గంటల తరబడి ట్రాఫిక్ జాంలు.. రణగొణధ్వనులతో నగర ప్రజలు నిత్యం పడుతూ లేస్తూ ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే మన భాగ్యనగరం భిన్నంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాంలు మినహా హైదరాబాద్ నగరంలో రహదారులపై సగటు వేగం గంటకు 25కిలోమీటర్లకు పెరిగింది.
కొన్ని ప్రైవేటు సంస్థలు, రవాణా సంస్థలు కలిపి గతేడాది దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలతో పాటు పుణె నగరాల్లో ‘స్పీడ్’ సర్వే నిర్వహించాయి. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపించిన ఏప్రిల్, మే నెలలు మినహా జనవరి 2021 నుంచి డిసెంబరు నెల వరకు రద్దీ రహదారులు, అనుసంధాన మార్గాల్లో వాహనాల సరాసరి వేగాన్ని నిర్ధారించాయి. ఆయా నగరాల్లో రహదారుల విస్తీర్ణం, వాహనాల సాంద్రత, మౌలిక సదుపాయాల ఆధారంగా సగటు వేగాన్ని లెక్కగట్టాయి. ఈ సర్వేలో హైదరాబాద్ నగరం గంటకు 25కిలోమీటర్ల వేగంతో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవగా.. రెండోస్థానంలో చెన్నై, మూడో స్థానంలో బెంగళూరు నిలిచాయి.
హైదరాబాద్ సిటీ, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు పోలీస్ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌జాంలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా తర్వాత బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వైరస్ సోకుతోందన్న భావనతో మధ్యతరగతికి చెందిన చాలామంది కార్లు కొనుగోలు చేయడంతో రహదారులపై రద్దీ మరింత పెరిగింది. రోజువారీ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు అప్పటికే మొదలైన ఎస్‌ఆర్డీపీ పనులు, జాతీయ రహదారులపై మరమ్మతుల వేగం పెరగడంతో కొన్ని కొత్త రహదారులు అందుబాటులోకి వచ్చాయి.
దీనికి తోడు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పై వంతెనలు, ఇతర వంతెనలు గతేడాది అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు శివారు ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పూర్తవడంతో వాహనాల సగటు వేగం పెరిగింది. దుర్గం చెరువు పైవంతెనతో జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు దాదాపుగా పరిష్కారమయ్యాయి. షేక్‌పేట ఫ్లైఓవర్, సంతోష్‌నగర్ ఫ్లైఓవర్‌లతో పాతబస్తీలో అవస్థలు తప్పాయి.