తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా పుకార్ల బారిన పడ్డారు. ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఆస్పత్రిలో చేరారనే వార్తలు సోషల్మీడియాలో తెగ వైరలయ్యాయి. దాంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఒకటే ఫోన్లు. ఈ బాధ తట్టుకోలేక చివరికి ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు హేమ మాలిని.
‘నేను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వస్తోన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు హేమ మాలిని.
28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అయితే హేమ మాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించారు. తన తల్లి డ్రీమ్ గర్ల్ హేమ మాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాక హేమ మాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు, తమ పట్ల చూపిస్తోన్న ప్రేమకు ఈషా డియోల్ కృతజ్ఞతలు తెలిపారు.