మహిళా రిజర్వేషన్ బిల్లుపై హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు..!

Hema Malini's interesting comments on the Women's Reservation Bill..!
Hema Malini's interesting comments on the Women's Reservation Bill..!

మంగళవారం నాడు పార్లమెంటులో మహిళలకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలలో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సోమవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగిన తరువాత ఈ బిల్లుకు క్యాబినెట్ ఆమోద తెలిపిందనే వార్తలు వచ్చాయి. కానీ, అధికారిక సమాచారం ఏదీ అప్పటికి రాలేదు. మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో తొలి సమావేశాలు ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. అయితే.. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరిట ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఎంపీల ముందుంచారు.

ఈ సందర్భంగా బిల్లుకు తాను మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చిన ఈ రోజు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘మహిళల కోసం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో సెప్టెంబర్ 19 చారిత్రాత్మక రోజుగా మారింది. నూతన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ మొదటి బిల్లు త్వరలో సభ్యుల ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 81 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు తర్వాత మా సంఖ్య 181 అవుతుంది. దీంతో, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళలకు ఆకాశమే హద్దు. కాబట్టి మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలో పని చేసేందుకు వారు ముందుకు రావాలి’’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.