నితిన్ నిర్మాతగా మారి చాలా కాలమవుతోంది. ఇష్క్తోనే స్వయంగా ప్రొడక్షన్లోకి దిగిన నితిన్ బయటి హీరోతో కూడా సినిమా తీసేసాడు. నాగార్జున తనయుడు అఖిల్‌ని పరిచయం చేసింది నితినే. ఆ చిత్రం క్లిక్ అయితే నితిన్ ఇంకా ఉత్సాహంగా సినిమాలు తీసి వుండేవాడు కానీ అది పరాజయం పాలవడంతో ఇతర హీరోలతో నిర్మాణం జోలికి పోవడం లేదు. ఇతర భాషలలో తనకి నచ్చిన సినిమాల రీమేక్ హక్కులయితే తీసుకుంటున్నాడు కానీ అవి తనకి సూట్ కావేమో అని వెనక్కి తగ్గుతున్నాడు.
అలాగే రాచ్చసన్ రీమేక్ హక్కులు తీసుకుని కూడా బెల్లంకొండ శ్రీనివాస్‌కి ఇచ్చేసాడు. హిందీ చిత్రం అంధాదూన్ రీమేక్ హక్కులు పొందిన నితిన్ ఈసారి మాత్రం రైట్స్ ఎవరికీ ఇవ్వడం లేదు. ఇది ఎవరైనా యువ హీరోతో తానే నిర్మించాలని డిసైడ్ అయ్యాడు. చిన్న సినిమాలు నిర్మిస్తోన్న నాని, విజయ్ దేవరకొండలా నితిన్ కూడా ఇకపై లో బడ్జెట్ చిత్రాలని నిర్మించబోతున్నాడు.
అయితే నాని, విజయ్‌లకి లేని అపారమైన అనుభవం నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి వుంది. ముఖ్యంగా రీమేక్ హక్కులు దక్కించుకోవడంలో నితిన్ అనుభవం, అతనికున్న లింక్స్ ఏమిటనేది తెలుస్తుంది. నితిన్ కనుక ఇలా చిన్న సినిమాల నిర్మాణం చేపడితే చాలా మందికి గేట్ వేగా మారగలడు. త్వరలోనే అంధాదూన్ రీమేక్ వివరాలని నితిన్ ప్రకటించబోతున్నాడు.