చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారు

చంపేస్తామ‌ని బెదిరిస్తున్నారు

త‌న‌ను, త‌న కుటుంబ సభ్యుల‌ను చంపేస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని ‘ఉడాన్’ న‌టి మాల్వీ మ‌ల్హోత్రా ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే నిర్మాత చేతిలో క‌త్తిపోట్ల‌కు గురైన న‌టి త‌న కుటుంబానికి ప్రాణ‌హాని ఉందంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌నను ఫ్యామిలీతో స‌హా చంపుతామ‌ని బెదిరిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. కాగా త‌న‌తో వివాహానికి అంగీక‌రించ‌లేద‌న్న కోపంతో నిర్మాత యోగేశ్ మ‌హిపాల్ సింగ్ అక్టోబ‌ర్ 26న మాల్వీపై క‌త్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజే పోలీసులు యోగేశ్‌ను అరెస్ట్ చేశారు. మరోవైపు క‌త్తిపోటు గాయాల‌ నుంచి ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో చంపుతామ‌ని బెదిరింపులు రావ‌డంతో న‌టి భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

దీని గురించి మాల్వీ మాట్లాడుతూ.. “న‌వంబ‌ర్ 18న రాత్రి 9 గంట‌ల‌కు నేను, నా ఫ్యామిలీతో క‌లిసి ఇంటి ప‌రిస‌రాల్లో వాకింగ్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో మాస్కు పెట్టుకున్న‌ ఓ వ్య‌క్తి బైక్ మీద వ‌చ్చి మా నాన్నను బెదిరించాడు. యోగేశ్‌కు త్వ‌ర‌లోనే బెయిల్ వస్తుంది. అప్పుడు మీ కుటుంబం అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చాడు. అప్ప‌టి నుంచి నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నాను. మ‌రో ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం” అని తెలిపారు.త‌న ఆరోగ్య ప‌రిస్థితిని గురించి వివ‌రిస్తూ.. ‘పూర్తిగా న‌య‌మ‌వ‌లేదు. కేవ‌లం వైద్య ప‌రీక్ష‌ల‌ కోస‌మే బ‌య‌ట‌కు వెళ్తున్నా. సాయంత్రం పూట న‌డ‌వాల‌ని వైద్యులు సూచించారు. క‌త్తిగాయాల వ‌ల్ల స‌రిగా న‌డ‌లేక‌పోతున్నందుకు కొంత వ్యాయామం చేయాల‌న్నారు. త‌న‌నీ స్థితికి తీసుకువ‌చ్చిన‌ యోగేశ్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటార‌ని ఆశిస్తున్నా’న‌న్నారు.