Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పెళ్లిచేసుకుంటామని నమ్మించి అబ్బాయిలు, అమ్మాయిలను మోసం చేసిన ఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ ఘటన అందుకు భిన్నమైనది. పెళ్లిపేరిట ఓ ఎన్నారైను మోసం చేసింది ఒక యువతి. ఆమె సాధారణ యువతి కూడా కాదు. సెలబ్రిటీ. ఓ వర్ధమాన హీరోయిన్. ఆమె పేరు శృతి. ఆడి పొన్ అవణి హీరోయిన్. ఓ సినిమాలో హీరోయిన్ గా చేసినప్పటికీ తర్వాత ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ హీరోయిన్ గా విలాస జీవితానికి అలవాటు పడింది. సంపాదన లేకపోవడం, ఖర్చులు పెరిగిపోతుండడంతో ఆమె ఆలోచనలు దారితప్పాయి. తప్పులు సరిదిద్దాల్సిన కుటుంబసభ్యులే స్వయంగా ఆమెను పెడదోవపట్టించారు. వారి ప్రోత్సాహంతో హీరోయిన్ కాస్త పెళ్లికూతురి అవతారమెత్తింది. ఫేస్ బుక్ వేదికగా ధనవంతులైన యువకులకు ఎరవేయడం మొదలుపెట్టింది. ఎనిమిది మంది యువకులు ఆమె బుట్టలో పడ్డారు. అరుణ్ కుమార్, సంతోష్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు శృతి మోసం తెలియక ఆమెకు లక్షలాది రూపాయలు అందజేశారు. అంతటితో ఆమె అవసరాలు తీరలేదు.
ఈ సారి ఓ ఎన్నారైపై దృష్టిపెట్టింది. మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో వెతకగా… జర్మనీలో ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్న జి. బాలమురుగన్ అనే ఓ ఎన్నారై ప్రొఫైల్ ఆమెను ఆకర్షించింది. వెంటనే అతన్ని పరిచయం చేసుకుంది శృతి. తన పేరు మార్చి మైథిలీ వెంకటేశ్ గా చెప్పి అతనితో మాటలు కలిపింది. పరిచయం పెరిగిన తరువాత పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తన కుటుంబ సభ్యుల ఫొటోలనూ అతనికి పంపింది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. తర్వాత కొన్నాళ్లకు తన ఆరోగ్యం బాగోలేదని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తనకు శస్త్ర చికిత్స చేయాలని, తన తల్లి ఆరోగ్యం కూడా బాగుండదని, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని… అబద్దాలు చెప్పి బాలమురుగన్ ను నమ్మించింది. ఆమె గురించి తెలియని బాలమురుగన్ ఆ మాటలు నమ్మాడు. ఆమె కోరినట్టుగా పలుమార్లు ఆర్థికసాయం చేశాడు. 2017 మే నుంచి డిసెంబర్ వరకు ఇలా మొత్తం రూ.41లక్షలు ఆమెకు పంపించాడు. అంతా బాగానే సాగుతున్న క్రమంలో బాలమురుగన్ చేసిన ఓ పనితో శృతి బండారం బయటపడింది.
తనకు కాబోయే భార్యను అందరికీ పరిచయం చేయలన్న ఉద్దేశంతో బాలమురుగన్ శృతి ఫొటోలను తన బంధువులకు, స్నేహితులకు చూపించాడు. శృతి కుటుంబ సభ్యుల ఫొటోలు కూడా అందులో ఉన్నాయి. శృతి ఫొటోలు చూసిన వారు ఆమెను హీరోయిన్ గా గుర్తుపట్టారు. ఆమె పేరు మైథిలి కాదని తెలియజేశారు. మోసపోయానని గ్రహించిన బాలమురుగన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆయన ఫిర్యాదు అందుకున్న పోలీసులు శృతిని, ఆమె తల్లి, సోదరుడ్ని అరెస్టు చేశారు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, విలాస వంతమైన జీవితానికి అలవాటు పడడం వల్లే తాను ఇలా యువకులను మోసం చేయాల్సి వచ్చిందని శృతి పోలీసుల విచారణలో అంగీకరించింది. తన తల్లి, సోదరుడి సహకారంతోనే తాను ఇలా చేశానని, మొత్తం 8మందిని మోసం చేశానని తెలిపింది. శృతి మరింతమందిని మోసం చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.