మళ్ళీ పోస్టుమార్టం చేయడానికి హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో గత నెలలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం, దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కాగా ఈ దారుణమైన ఘటనకు కారణమైనటువంటి ఆ నలుగురు మృగాలను పోలీసులు ఆత్మరక్షణ నిమిత్తం ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా ఆనందాలు వెల్లువైనప్పటికీ కూడా కొందరు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ ని తప్పుబడుతూ కొన్ని సంఘాలు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. కాగా ఈమేరకు న్యాయస్థానం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం.

అయితే ఈ నలుగురు నిందితుల మృతదేహాలకు మళ్ళీ పోస్టుమార్టం చేయడానికి హైకోర్టు ఆదేశాలిచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. కాగా ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు నేడు గాంధీ ఆసుపత్రికి వెళ్లి ఆ నిందితుల మృతదేహాలకు మళ్ళీ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అయితే ఈ పోస్టు మార్టానికి సంబంధించిన మొత్తం తతంగాన్ని కూడా వీడియో రికార్డ్ చేపించి ఆ తర్వాత మృతదేహాల్ని వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించమని ఆదేశాలిస్తామని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్‌‌ చౌహాన్ బెంచ్ తెలిపినప్పటికీ కూడా, ఈ రీపోస్టుమార్టం అనే అంశాన్ని ప్రభుత్వ లాయర్ బి.ఎస్‌‌.ప్రసాద్‌‌ వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఆ మృతదేహాలకు మళ్ళీ పోస్టుమార్టం నిర్వహిస్తే ఏం జరుగుతుంది… ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది అని బెంచ్ అడిగిన ప్రశ్నల నేపథ్యంలో ఈ విచారణని హైకోర్టు నేటికీ (శనివారానికి) వాయిదా వేసింది. కాగా నేడు జరిగే విచారణలో న్యాయస్థానం తీసుకునే నిర్ణయం ప్రకారం రీపోస్టుమార్టం జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది.