టీటీడీ మీద పిల్…హైకోర్టు కీలక వ్యాఖ్యలు

శ్రీవారికి చెందిన సొమ్మును ప్రయివేట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కొద్ది కాలం క్రితం ఓ వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన సంగతి తెలిసిందే. కొద్ది కాలం క్రితం రూ.1,000 కోట్లను ఇండస్‌ఇండ్ బ్యాంకులో తిరుమల తిరుపతి దేవస్థానం జమ చేసింది. దీనిని సవాలు చేస్తూ తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. శ్రీవారి ధనం, నిధులు బ్యాంకుల్లో జమచేసే నిమిత్తం మార్గదర్శకాల్ని రూపొందించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని ఆయన కోరారు. అలాగే టీటీడీ చరిత్రలో నిధుల్ని ప్రైవేటు బ్యాంకుల్లో జమచేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.

దాఖలైన పిల్‌పై మీద జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్‌, జస్టిస్ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణకు స్వీకరించింది. ఈ పిల్ మేడా ఆ ధర్మాసనం పలు కీలక వ్యాఖలు చేసింది. ఇండస్‌ఇండ్ కూడా ఆర్బీఐ నియంత్రణలో ఉండే షెడ్యూల్డ్‌ బ్యాంకేనని స్పష్టంచేసింది. అంతేకాదు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సొమ్ము భద్రమనే భావన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కుంభకోణంతోనే పోయిందని, కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే సొమ్ము భద్రంగా ఉంటుందని చెప్పలేమంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.