Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులు నూపుర్, రాజేశ్ తల్వార్ లను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ స్పందించారు. ఆరుషి తల్లిదండ్రులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆరుషి హత్యకేసు ఆధారంగా తెరకెక్కిన తల్వార్ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ సీబీఐ విచారణాధికారి అశ్విన్ కుమార్ పాత్ర పోషించారు. అలాగే ఇర్ఫాన్ తో పాటు తల్వార్ చిత్ర దర్శకురాలు మేఘనా గుల్జార్, నిర్మాత విశాల్ భరద్వాజ్ కూడా తీర్పుపై హర్షం వ్యక్తంచేశారు. తీర్పు గురించి వినగానే తనకు చాలా సంతోషం వేసిందని మేఘనా గుల్జార్ చెప్పారు. తమ సినిమాలో ఎవరి పక్షం వహించకుండా తటస్థ ధోరణితో చూపించినప్పటికీ… తమని ఎంతో మంది ఎన్నో ప్రశ్నలు వేశారని విశాల్ భరద్వాజ్ గుర్తుచేసుకున్నారు. తల్వార్ దంపతులకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, అయితే తొమ్మిదేళ్ల జైలు జీవితంతో వారు తమ విలువైన సమయాన్ని కోల్పోయిన సంగతి ఆలోచిస్తే మాత్రం బాధ కలుగుతుందని భరద్వాజ్ అన్నారు.
2008 మే 16న ఆరుషి హత్య జరిగింది. తన ఇంట్లోని బెడ్ రూంలో ఆమె రక్తపు మడుగులో పడిఉంది. మరుసటి రోజు ఆమె ఇంటి టెర్రస్ పై పనిమనిషి హేమ్ రాజ్ హతుడై కనిపించాడు. వెంటవెంటనే ఆరుషి, హేమరాజ్ హత్యకు గురికావడంతో ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేశ్ తల్వార్ పై పోలీసులకు అనుమానమొచ్చింది. ఆరుషి, హేమరాజ్ ను సన్నిహితంగా చూసిన రాజేశ్ ఆవేశంలో ఆరుషిని హత్యచేశాడని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే ఆరుషి హత్య వెలుగుచూసిన మరుక్షణం నుంచే జాతీయ మీడియా ఈ వార్తను విస్తృతంగా కవర్ చేసింది. ఆ క్రమంలో రిపోర్టర్లు సంఘటనా స్థలంలో సంచరించడంతో హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు చెరిగిపోయాయి. దీంతో ఆరుషిని ఆమె తల్లిదండ్రులే హత్య చేశారనడానికి పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ బృందాలు కూడా దీనిపై నిర్ధారణకు రాలేకపోయాయి.
అయితే ఈ హత్యలు బయటి వ్యక్తులు చేసే అవకాశం లేదని, తల్వార్ దంపతులే కూతురిని, పనిమనిషి హేమరాజ్ ను చంపివేసి చాలా పకడ్బందీగా సాక్ష్యాలను నాశనం చేశారని, హత్యలు జరిగినప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షలు విధించాలని సీబీఐ వాదించింది. వారి వాదనతో ఏకీభవించిన సీబీఐ న్యాయస్థానం ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా నిర్ధారిస్తూ 2013లో వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ… ఆరుషి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. సందర్భానుసార సాక్ష్యాల వల్లే ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను దోషులుగా తేల్చారని, అంతేగానీ వారే హత్యచేశారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని హైకోర్టు పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద రాజేశ్ ను, ఆయన భార్యను నిర్దోషులుగా ప్రకటించింది… ఈ కేసు మీద ఏక్ ఆరుషి థీ పేరుతో సునీల్ మౌర్య అనే రచయిత పుస్తకం రాశారు. దాని ఆధారంగానే తల్వార్ సినిమా తెరకెక్కింది.