Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా, ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నాయి. సరిహద్దుల్లో యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం హోదాలో ఒక హుందా అయిన ప్రకటన చేసిన అమెరికా… ఒకరోజు గడవకముందే మాటమార్చి విమర్శలకు కేంద్రబిందువయింది. ఉత్తరకొరియా నుంచి తొలిబాంబు పడేంత వరకూ తాము చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్ సన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని, ఆయన స్వయంగా ఈ విషయాన్ని చెప్పారని టిల్లర్ సన్ తెలిపారు. ఆ తరువాత మాత్రం యుద్ధం మినహా మరో ఆలోచన ఉండదన్నారు. అయితే టిల్లర్ సన్ ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటిరోజే ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుంటూ ప్రకటన చేశారు.
ఉత్తరకొరియాతో చర్చలు జరపడమే కాదు..ఆ ఆలోచన చేయడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు. అమెరికాలోని ప్రతిపక్షాలతో పాటు..ప్రపంచ దేశాలు కూడా ట్రంప్ వ్యాఖ్యలు తప్పుబడుతున్నాయి. తన తెలివితక్కువ తనంతో ట్రంప్ మూడో ప్రపంచ యుద్ధాన్ని మొదలుపెట్టేలా ఉన్నారని హిల్లరీ క్లింటన్ మండిపడ్డారు. దౌత్యపరంగా పరిష్కరించాల్సిన సమస్యను ట్రంప్ తన వైఖరితో జటిలం చేశారని, ఆమె విమర్శించారు. సమస్యను చర్చల ద్వారా పరిష్కరిద్దామని విదేశాంగ మంత్రి టిల్లర్ సన్ సూచిస్తే…ట్రంప్ ఆయననే తప్పుబట్టడం ఏంటని హిల్లరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన వైఖరితో న్యూక్లియర్ రేస్ ను ట్రంపే మొదలుపెట్టినట్టయిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలు మొదలయిన కొత్తలోనే అమెరికా.. చైనా మధ్యవర్తిత్వంతో ఉత్తరకొరియాతో చర్చలు జరిపిఉంటే బాగుండేదని విశ్లేషించారు.
ఉత్తరకొరియా విధానాలను కూడా హిల్లరీ తప్పుబట్టారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు లెక్కచేయకుండా ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాలు చేపట్టడం సరికాదని హిల్లరీ స్పష్టంచేశారు. అటు ట్రంప్ ను ఉద్దేశించి ఉత్తరకొరియా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉంది. తాజాగా ట్రంప్ కు తాము మరణాన్ని కానుకగా ఇవ్వనున్నామని హెచ్చరిస్తూ ఉత్తరకొరియా ఓ ఫొటోను విడుదల చేసింది. ఈ పొటోలో ట్రంప్ తలకిందులుగా వేలాడిఉన్నారు. ఆయన నోటినుంచి రక్తం కారుతోంది. పిచ్చి పట్టిన స్థితిలో ఉన్న ముసలోడు ట్రంప్ కు మరణాన్ని అందించాల్సి ఉంది అన్న క్యాప్షన్ ఈ ఫొటోపై ఉంది. ఉత్తరకొరియా మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. అణుసామర్థ్యమున్న క్షిపణులను రాజధాని పాంగ్ యాంగ్ కు తరలిస్తున్నట్టు నిన్న ఉత్తరకొరియా ప్రభుత్వం కొన్ని ఫొటోలు విడుదలచేసింది. తాము మరిన్ని అణుపరీక్షలు నిర్వహిస్తామని కూడా ఆ దేశం ప్రకటించింది. తాజా పరిస్థితులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.