Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో పవన్ ఎటు వెళ్లినా తమకు నష్టంలేదని హోం మంత్రి చినరాజప్ప స్పష్టంచేశారు. విభజన బాధిత ఏపీ అభివృద్ధి దిశలో ముందుకు సాగడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమన్నారు. ఈ విషయాన్ని గ్రహించకుండా… తెరవెనుక ఎవరో చెప్పించినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడడం మంచిది కాదని, ఆయన వ్యాఖ్యల వెనక బీజేపీ హస్తం ఉందని మండిపడ్డారు. బీజేపీకి, పవన్ కు మధ్య రాయబారం ఎవరు నడిపారనే విషయం త్వరలో తేలిపోతుందన్నారు. చంద్రబాబును, లోకేశ్ ను విమర్శించడం సరికాదని, నిధుల కోసం, ప్రత్యేక హోదా కోసం టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తున్న సమయంలో పవన్ ఇలా మాట్లాడడం ఎంతమాత్రం మంచిదికాదని చినరాజప్ప హితవుపలికారు. టీడీపీ పోరాటాన్ని సహించలేని బీజేపీ పవన్ ను, జగన్ ను ఎగదోస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంచి నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ ను తొక్కేయడం కోసమే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని, లోకేష్ పై పవన్ నిరాధార ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ తన పార్టీ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదని, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ పైగానీ, బీజేపీపైనగానీ, ఒక్క విమర్శ కూడా చేయలేదని… ఇవన్నీ ఆయన మాటల వెనక ఉన్న వాస్తవాలను బయటపెడుతున్నాయని చినరాజప్ప విశ్లేషించారు. కేవలం చంద్రబాబును విమర్శించేందుకే సభ నిర్వహించినట్టు ఉందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలంతా అవినీతిపరులే అన్న పవన్ వ్యాఖ్యలను చినరాజప్ప ఖండించారు. ఒకరిద్దరు చేసిన పనులకు అందరినీ విమర్శించడం సరికాదని, భవిష్యత్తులో జనసేనకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు కావాలని… అప్పుడు ఎక్కడనుంచి తీసుకొస్తారో చూద్దామని ఆయన ఎద్దేవా చేశారు.