Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబాకు జైలు శిక్ష ఖరారు అయిన తర్వాత కనిపించకుండా పోయిన ఆయన దత్తపుత్రికగా చెప్పుకునే హనీప్రీత్ సింగ్ గురించి కచ్చితమైన సమాచారం పోలీసులకు లభించింది. హనీప్రీత్ ప్రస్తుతం నేపాల్ లో ఉన్నట్టు డేరాకు సంబంధించిన ఓ ముఖ్య వ్యక్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గత నెల 25న గుర్మీత్ ను సీబీఐ న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత హర్యానా, పంజాబ్ ల్లో పెద్ద ఎత్తున విధ్వంసం చెలరేగింది. దీనివెనక హనీప్రీత్ హస్తముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
గుర్మీత్ కు శిక్ష ఖరారు అయిన సమయంలో ఆయన వెంటే ఉన్న హనీప్రీత్ ఎర్రబ్యాగుతో సంకేతాలివ్వడం ద్వారా బాబాను తప్పించేందుకు కుట్ర పన్నింది. అయితే వారి పన్నాగాన్ని గ్రహించిన పోలీసులు ఎలర్ట్ అయి బాబాను ప్రత్యేక హెలికాప్టర్ లో పంచకుల కోర్టు నుంచి రోహ్ తక్ జైలుకు తరలించారు. ఈ ఘటన తర్వాత హనీప్రీత్ కనిపించకుండా పోయింది. అప్పటినుంచి పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. గుర్మీత్ కేసు విచారణలో భాగంగా..సిర్సా డేరాకు అనుబంధంగా ఉన్న ఉదయ్ పూర్ డేరా ఆశ్రమ ఇన్ చార్జ్ ప్రదీప్ గోయల్ ను పోలీసులు అరెస్టుచేశారు.
విచారణలో ప్రదీప్ గోయల్ హనీప్రీత్ నేపాల్ లో ఉన్నట్టు స్పష్టమైన సమాచారమిచ్చాడు. దీంతో అధికారులు హనీప్రీత్ ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపించారు. అతిత్వరలో హనీప్రీత్ ను అరెస్టు చేసి ఇండియాకు తీసుకువస్తామని పోలీసులు నమ్మకంతో ఉన్నారు. అయితే హనీప్రీత్ నేపాల్ లో ఉందని తెలిసినప్పటికీ ..రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న ఏడు జిల్లాల్లో ఆమె ఎక్కడ తలదాచుకుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు.