ఇకపై క్రికెట్లో భార‌త్ దే హ‌వా..

Sandeep Patil comments on Yuvraj and Dhoni

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్ ల్లో యువ‌రాజ్ సింగ్ కు చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయన రిటైర్మెంట్ పై ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే స‌మ‌యంలో కెప్టెన్ గా త‌ప్పుకుని, వ‌న్డేల్లో నిల‌క‌డ‌గా రాణిస్తూ జ‌ట్టులో చోటు నిల‌బెట్టుకుంటున్నప్ప‌టికీ… మ‌హేంద్ర సింగ్ ధోనీ పైనా రిటైర్మెంట్ వ్యాఖ్య‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రి గురించి త‌న అభిప్రాయాన్ని సూటిగా వివ‌రించాడు బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ మాజీ చైర్మ‌న్ సందీప్ పాటిల్. టీమిండియా ప్ర‌పంచ‌క‌ప్ హీరో అయిన యువరాజ్ సింగ్ భార‌త క్రికెట్ కు దేవుడిచ్చిన వ‌ర‌మ‌న్నాడు సందీప్ పాటిల్. 2019 ప్ర‌పంచ‌క‌ప్ లో అత‌డు ఆడేదీ లేనిదీ… ఫామ్, ఫిట్ నెస్ పై ఆధార‌ప‌డి ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

ధోనీ గురించి మాట్లాడుతూ అత‌నెంతో ప్ర‌త్యేక‌మైన ఆట‌గాడ‌ని కొనియాడాడు. భార‌త క్రికెట్ దిగ్గ‌జాల చేతుల్లోనుంచి..యువ‌కుల చేతుల్లోకి మారే ప‌రిణామ క్ర‌మంలో సందీప్ పాటిల్ బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ గా ప‌నిచేశాడు. 2012 నుంచి 2016వ‌ర‌కు సందీప్ పాటిల్ చీఫ్ సెల‌క్ట‌ర్ గా ఉన్న స‌మయంలోనే స‌చిన్, ద్ర‌విడ్, ల‌క్ష్మ‌ణ్, వంటి దిగ్గ‌జాలు అంత‌ర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప‌లికారు. వారి స్థానాల‌ను యువ‌కుల‌తో భ‌ర్తీ చేసే క్ర‌మంలో సందీప్ క‌ఠిన‌నిర్ణ‌యాలు తీసుకోవాల్సి వ‌చ్చింది. దీనిపై సందీప్ సంతోషం వ్య‌క్తంచేశారు. తాను అప్పుడు తీసుకున్న నిర్ణ‌యాలు ఇప్పుడు స‌రైన ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని, త‌న‌నిర్ణ‌యాలు భార‌త క్రికెట్ కు ఎంతో లాభించామ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డాడు. 1950, 60ల్లో వెస్టెండీస్ క్రికెట్ లో ఆధిప‌త్యం చెల‌యించింద‌ని, ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా హ‌వా సాగింద‌ని, ఇప్పుడు ప్ర‌పంచ క్రికెట్ ఆధిప‌త్యం భార‌త్ చేతుల్లోకి వ‌స్తోంద‌ని సందీప్ విశ్లేషించారు.