Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా కి శిక్ష పడ్డ తర్వాత ఆయన సన్నిహితురాలు హానీ ప్రీత్ కోసం పోలీసులు దేశమంతా జల్లెడ వేస్తున్నారు. ఓ దశలో ఆమె నేపాల్ పారిపోతుందని భావించి సరిహద్దుల్లో భారీగా నిఘా ఏర్పాటు చేశారు. రాజస్థాన్ లో ఆమె కారు డ్రైవర్ దొరకడంతో అక్కడంతా సోదాలు జరిపారు. అయినా ఇప్పటిదాకా హానీ ప్రీత్ ని పట్టుకోలేకపోయారు ఖాకీలు. ఇంతలో వాళ్ళని ఇంకాస్త రెచ్చగొట్టే విషయం బయటికి వచ్చింది. ఆమె బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించింది. హానీ ప్రీత్ తరపున ఆమె లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య ఢిల్లీ హై కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ లో సాక్షాత్తు హానీ ప్రీత్ సంతకం చేసిందని, అందుకోసం ఆమె తమ ఇంటికి వచ్చిందని బెయిల్ పిటీషన్ వేసిన న్యాయవాది ప్రదీప్ కుమార్ ఆర్య ప్రకటించడంతో పోలీసులకి మండిపోయింది.
భద్రత ఏర్పాట్ల కోసం అడుగడుగునా ఖాకీలు కనిపించే ఢిల్లీలో హానీ ప్రీత్ ఇంత తేలిగ్గా ఎలా తప్పించుకు తిరగగలుగుతుంది అన్నది పోలీసుల్ని వేధిస్తున్న ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకి ఓ సమాధానం దొరికింది వాళ్లకి. అయితే ఆ సమాధానం నిజమో, కాదో తేల్చే పనిలో వున్నారు పోలీసులు. ఇంతకీ వాళ్లకి దొరికిన ఆ సమాధానం ఏంటో తెలుసా ? ప్రదీప్ కుమార్ ఆర్య ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ టీవీ ఫుటేజ్. ఆ ఫుటేజ్ లో ఓ మహిళ బుర్ఖా వేసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లిరావడం కనిపించింది. ఆ బుర్ఖా వేసుకున్న మహిళ హానీ ప్రీత్ కావొచ్చు అన్న కోణం నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ అనుమానమే నిజం అయితే ఎన్నో తెలుగు సినిమాల్లో కనిపించే ఓ సాదాసీదా ట్రిక్ తో హానీ ప్రీత్ పోలీసుల్ని బురిడీ కొట్టించింది అనుకోవాల్సి ఉంటుంది.