తమ కుమార్తె ప్రేమించిన యువకుడ్ని ఆమె తల్లిదండ్రులు దారుణంగా కొట్టిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. తమ పరువు పోవడానికి కారణమయ్యాడని యువకుడిపై అమ్మాయి తండ్రి, సోదరుడు వీధుల్లో దాడిచేసి పరుగెత్తించి సుత్తితో కొడుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. షాజాపూర్ జిల్లా మక్సీ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడ్ని యువకుడ్ని పుష్పక్ భవసార్ గా గుర్తించారు.
మక్సీ పట్టణానికి చెందిన యువకుడు, ఆ ప్రాంతానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇటీవలే ఇంటి నుంచి పారిపోయారు. ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదురడంతో ప్రేమికులు ఇంటికి తిరిగొచ్చారు. అయితే, అప్పటికే భవసార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యువతి తండ్రి.. అతడు ఒంటరిగా ఎప్పుడు దొరకుతాడా? అని కాపుకాచాడు. ఆదివారం నాడు యువకుడు మార్కెట్‌కు వెళుతుండగా.. యువతి తండ్రి, ఆమె సోదరుడు దాడిచేశారు. సుత్తితో కాళ్లు, చేతులపై దారుణంగా కొట్టారు.
రద్దీగా ఉండే నడిరోడ్డుపైనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో పలువురు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడున్న ఎవరో మొబైల్ ఫోన్లో వీడియో రికార్డ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులతోపాటు యువకుడిపై కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితుడిపై కేసు నమోదుచేయడాన్ని యువకుడి కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ షాజాపూర్ ఎస్పీని కలిసి మెమోరాండం సమర్పించారు. చావుదెబ్బలు కొట్టిన వారిపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
‘జుత్తు కత్తిరించుకోడానికి మార్కెట్లోని సెలూన్‌కు వెళ్లిన తమ కుమారుడ్ని షాపులోని నుంచి యువతి తండ్రి, సోదరుడు ఈడ్చుకొచ్చి దాడిచేశారు. కాళ్లు, చేతులతో విచక్షణారహితంగా సుత్తితో కొట్టారు.. చంపాలనే ఉద్దేశంతో ఇలా చేశారు.. ఈ దాడిలో పుష్పక్ భవసార్కు తీవ్ర గాయాలయ్యాయి.. వీడియో చూపించిన తర్వాత కూడా పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదుచేయడం ఏంటి?’ అని అతడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు.