ముందుగా ప్రకటించినట్టుగానే నేటినుండి తెలంగాణ రాష్ట్రంలోని 220 ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నేటినుండి (డిసెంబర్ 1) నిలిపివేశాయి. ఆర్ధికంగా వెనుకబడిన ప్రజలకు, ఉద్యోగులకు ఉచిత వైద్యసేవలు కల్పించే ఆరోగ్యశ్రీ ఒక వరం లాంటిదే అని చెప్పొచ్చు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉచిత విద్య, వైద్యం తప్పనిసరి అని ఐక్యరాజసమితి తో సహా ప్రపంచ దేశాలన్నీ మొత్తుకుంటున్నా, కొన్ని దేశాలు ఈ కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించిన నాటినుండి ఇప్పటివరకు ఎటువంటి అంతరాయం కలుగకపోయినా, ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రుల సముదాయం కి ప్రభుత్వం సుమారు రూ. 1200 కోట్లు బకాయి పడడంతో, ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేయడం తప్ప వేరే దారి లేదని పేర్కొన్న ఆసుపత్రులు నేటినుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలుపుదల చేసి, ప్రజల పట్ల కఠిన వైఖరిని అవలంబించాయని చెప్పొచ్చు.
ఈ ఆసుపత్రులను బుజ్జగించే పనిలో భాగంగా ప్రభుత్వం గురువారం నాడు ఆఘమేఘాల మీద 150 కోట్లు విడుదల చేసినా, లాభం లేకపోగా, పూర్తి బకాయిలు చెల్లించే దాకా తగ్గేది లేదని ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ పరిస్థితి రావడానికి ముఖ్య కారణం ఆరోగ్యశ్రీ కి సీఈఓ గా వ్యవహరిస్తున్న కే. మాణిక్యా రాజ్ ఐఏఎస్ అవలంబిస్తున్న వైఖరే కారణమని తెలుస్తుంది. ఆరోగ్యశ్రీ నెటవర్క్లో ఉన్న ఆసుపత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడానికి కూడా సుముఖత చూపలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఆరోగ్యశ్రీ నిలుపుదల రాష్ట్రంలోని ఎనభై లక్షల పైచిలుకు కుటుంబాలు, మూడు లక్షల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులపైన ప్రభావం చూపగలదు. ఈ విషయం పైన ప్రభుత్వం త్వరితగతిన స్పందించి, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోనుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.