కరోనా భయం: వైద్యురాలిని ఇల్లు ఖాలీ చేయకపోతే రేప్ చేస్తా అని బెదిరింపులు

వైద్యో నారాయణొ హరి అని చెప్తుంటారు. అలాంటి వారికే రక్షణ కరువైన దుర్మార్గమైన ఘటన తాజాగా ఒడిశాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతి భయంకరమైన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ విధులను నిర్వహిస్తున్నారు.

అయితే అలాంటి వైద్యులకే ప్రస్తుతం రక్షణ కరువైంది. అదేమంటే… ఒడిశాలో ఖండగిరి ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్ ను తన ఫ్లాట్‌ను ఖాళీ చేయమని కోరినట్లు తెలుస్తోంది. భువనేశ్వర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో జూనియర్ డాక్టర్ గా ఓ మహిళ పని చేస్తున్నారు. కరోనా భయంతో తన ఫ్లాట్‌ను ఖాళీ చేయకపోతే ఆమెపై అత్యాచారం జరుగుతుందని ఓ వ్యక్తి.. ఆమెను బెదిరించాడు. ఈ ఘటనపై ఫిర్యాదు తీసుకున్న వెంటనే పోలీసులు నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

అదేవిధంగా ఎఫ్‌ఐఆర్‌లో కోవిడ్ -19 రోగులకు చికిత్స చేస్తున్నందున.. ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయమని ఆఫీసు-బేరర్ ఆమెను కోరినట్లు తెలిపారు. ఇదే విషయంపై వారం రోజులుగా ఆమెను వాళ్లు వేధింపులకు గురిచేస్తున్నారని.. నిందితుడు ఏకంగా అత్యాచారం చేస్తానని బెదిరించారని.. ఆమె పోర్కొన్నారు. అంతేకాకుండా తాను కరోనావైరస్ రోగుల చికిత్సలో పాల్గొనలేదని స్పష్టం చేసినప్పటికీ.. వినిపించుకోలేదని వివరించారు. దీంతో వెంటనే సొసైటీ అధికారులు కౌంటర్ పిటీషన్ వేశారు. డాక్టర్ కుటుంబ సభ్యులే ఆఫీసు బేరర్లతో అసభ్యంగా ప్రవర్తించారని.. పేర్కొన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.