కరోనా ఎఫెక్ట్… ఇద్దరు పెళ్లాల మొగుడికి మద్యం తెచ్చిన తంటా

కరోనా వైరస్ తో ప్రపంచం అల్లల్లాడుతుంది. దేశంలో రోజురోజుకూ కరోనా విస్తరిస్తుంది. ఇప్పుడు కరోనా ప్రభావం ఇద్దరు భార్యలున్న వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపింది. అదెలాగంటే.. ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఆయనకు ఇద్దరు భార్యలు. ఈ కరోనా టైంలో ఒకరితో ఉండటమే కష్టం. అలాంటిదే ఇద్దరు భార్యలతో కలిసి ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది.

విశాఖపట్టణం జిల్లా కొత్తవీధి మండలం గూడెంకాలనీ గ్రామంలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన విషయాలను బట్టి చూస్తే… ఆ గ్రామానికి చెందిన వంతల నాగరాజుకు లక్ష్మీ, సుశీల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఇద్దరూ అదే గ్రామంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదు. దీంతో అందరం కలిసి ఒకేచోట ఉందామని నాగరాజు ఇద్దరి భార్యలతో చెప్పాడు. అందుకు ఇద్దరు భార్యలు అంగీకరించడంతో.. ముగ్గురు కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. తాజాగా భర్త కోసం ప్రేమగా నాటుకోడి వండారు. మిర్చీ మసాలా బాగా దట్టించి ఘుమఘుమలాడే కోడికూర తయారు చేశారు.

భర్త భోజనానికి రాగానే ప్రేమగా వండించాలని అనుకున్నారు. భర్త కోసం ఇద్దరు భార్యలు ఎంతో ప్రేమతో ఎదురు చూశారు. కానీ.. బయటకు వెళ్లిన నాగరాజు చాలా సేపటి తర్వాత ఇంటికి వచ్చాడు. బాగా మద్యం సేవించి వచ్చాడు. అంతే.. అప్పటివరకు భర్త కోసం ఎదురు చూసిన ఇద్దరు భార్యలు మండిపడ్డారు. ఇంటికి తాగి వస్తావా? అని చెడామడా తిట్టారు. భార్యలిద్దరూ కలిసి గొడవపెట్టుకున్నారు. అప్పటికే మద్యం కిక్కు తలెకెక్కేసిన నాగరాజు… ఆగ్రహంతో ఊగిపోయాడు. కోడిని కోసే కత్తిని పెద్దభార్య లక్ష్మిపైకి విసిరాడు. దీంతో కత్తి నేరుగా వెళ్లి ఆమె తలకు తగిలి గాయమైంది. రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే స్థానికులు కూడి ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు.