Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇప్పుడు రాజకీయ అవగాహన ఉన్నా లేకపోయినా అందరి దృష్టి మాత్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీదనే కేంద్రీకృతం అయి ఉంది. ఇంకా ఏడాదిలోపు లోక్ సభ ఎన్నికలు రానుండడం ఇప్పుడు వెలువడే ఫలితాలు ఆ ఎన్నికలమీద ప్రభావం చూపనుండడంతో రాజకీయ పార్టీల నేతలు అయితే కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే సాధారణంగా ఇటువంటి సమయంలో అందరు ఎగ్జిట్ పోల్స్ ను రెఫెర్ చేయడనికి మొగ్గు చూపుతారు. అయితే కర్నాటక విషయానికి వస్తే కర్టాటకలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ ప్రభుత్వం ఏర్పడితే అది కేవలం హాంగ్ ప్రభుత్వమే అని అంచనా వేశాయి. అత్యధిక స్థానాలు గెల్చుకొని అతి పెద్ద పార్టీగా ఏది అవతరిస్తుందన్నది ఏ సంస్థా ఖచ్చితంగా చెప్పలేకపోతోంది. ఈ విషయంలో ఆయా సంస్థలు ప్రదర్శిస్తున్న లౌక్యం యిట్టె అర్ధం అయిపోతోంది. దగ్గర దగ్గర చిన్నా పెద్దా కలిపి 10 సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అతి పెద్ద పార్టీ అవుతుందని అంచనా వేస్తే, ఏడు పోల్స్ కాంగ్రెస్ అవుతుందని చెబుతున్నాయి. వీటిలో ఏది నిజం? అసలు ఎగ్జిట్ పోల్స్‌లో నిజమెంత? గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిపిన ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ గా డీకోడ్ చేసాయో లేదో చూస్తే.
ఢిల్లీ – 2015:
ఒక్కోసారి కొన్ని కొన్ని సంస్థలు కాస్త దగ్గరగా వచ్చి, కొంతవరకు ప్రజల్లో ఉన్న భావాన్ని అంచనా వేస్తున్నాయి. కానీ లెక్కల్లో మాత్రం తేడా ఉంటాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ, 2015 బీహార్ అసెంబ్లీ, 2014 యూపీలో లోకసభ ఎన్నికలు, పరిశీలిస్తే ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏఏపీ 70 సీట్లకు గాను 67 స్థానాలు గెలిచింది. బీజేపీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. కానీ 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తరుణంలో చాలా వరకు ఏజెన్సీలు బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని కోట్ చేశాయి కాని వాటి అంచనాలని తల కిందులు చేస్తూ ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
బిహార్-2015:
బీహార్‌లో కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పుగా తేలాయి. అక్టోబర్-నవంబర్ 2015లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారి జేడీయూ, ఆర్జీడీ, కాంగ్రెస్ లు మహాకూటమిగా ఏర్పడ్డాయి. బీజేపీ కూటమిని నిలువరించడమే లక్ష్యంగా మహాకూటమి జట్టుకట్టింది. 243 స్థానాలున్నా బిహార్ అసెంబ్లీలో 130 సీట్లు మహాకూటమికి, 108 స్థానాలు బీజేపీ కూటమికి దక్కుతాయని ఏబీపీ-నిల్సన్ వెల్లడించింది. 122 స్థానాలు మహాకూటమికి, బీజేపి కూటమికి 111 స్థానాలు దక్కుతాయని టైమ్స్ నౌ-సీ ఓటర్ సంస్థలు అంచనా వేయగా…మహాకూటమి 178స్థానాలు కైవసం చేసుకొని..ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేసింది.
కేరళ – 2016 :
యూనైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు మధ్య సాగిన ఎన్నికల పోరులో ఎల్డీఎఫ్ విజయం సాధించింది. ఎల్డీఎఫ్ కు 78 స్థానాలు వస్తాయని సీ-ఓటర్ అనే సంస్థ తమ ఎగ్జిట్ పోల్ వెలువరించగా..91 స్థానాలు దక్కించుకొని అధికారం చేపట్టింది.
పశ్చిమ బెంగాల్ – 2016 :
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 210 సీట్లు దక్కుతాయని చాణక్య అంచనా వేయగా..సీ-ఓటర్ 167 స్థానాలు వస్తాయని చెప్పింది. చాణక్య అంచనాలకు కాస్త దగ్గరగా టీఎంసీకి 211సీట్లు దక్కి మమతా రెండోసారి సీఎం అయ్యారు. 243 అసెంబ్లీ సీట్లున్న పశ్చిమ బెంగాల్ లో కమ్యూనిస్టుల కంచుకోటను బద్ధలు కొట్టిన తృణమూల్ కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది.
అస్సాం – 2016 :
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 90సీట్లు దక్కుతాయని చాణక్య అంచనా వేయగా..వాస్తవ ఫలితాల్లో 86 సీట్లు చేజిక్కించుకొని అధికారం చేపట్టింది. పదిహేనేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అస్సాంలో ప్రజావ్యతిరేకత పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే అంచనా వేసింది.
గుజరాత్-2016
గుజరాత్‌లో మంచి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఖచ్చితంగా ఎంత తేడా ఉండొచ్చో చెప్పలేకపోయాయి. ఈ రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడంలో టుడేస్ చాణక్య అయితే ఘోరంగా విఫలమైంది. బీజేపీకి 135 సీట్లు గ్యారంటీ అని చెప్పింది. టైమ్స్ నౌ-వీఎంఆర్ 115 సీట్లు బీజేపీకి, 65స్థానాలు కాంగ్రెస్‌కు లభిస్తాయని చెప్పగా, రిపబ్లిక్-సీ ఓటర్, న్యూస్-18 నిర్వహించిన పోల్స్ 108-74 సీట్లు గెల్చుకుంటాయని పేర్కొన్నాయి. ఇవేవీ నిజం కాలేదు. బీజేపీ 100 సీట్లు కూడా సాధించలేకపోయింది. కానీ కాంగ్రెస్ మాత్రం అద్భుతంగా పోరాడి 80 సీట్లలో గెలుపొందింది. అయితే బీజేపీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయగలిగింది.
తమిళనాడు – 2016 :
ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీకి వరుసగా మరోసారి తమిళ ఓటర్లు అధికారం కట్టబెట్టరనే అభిప్రాయం ఉండేది. గతేడాదిలో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేశాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో అధికార అన్నాడీఎంకే, డిఎంకే- కాంగ్రెస్ కూటమి, ఇతర పార్టీలన్ని కలిపి మరో కూటమిగా బరిలోకి దిగాయి. ది యాక్సిస్-మై ఇండియా పోల్ అనే సంస్థ డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 120-140 స్థానాలు దక్కుతాయని చెప్పింది. అన్నాడీఎంకేకు 90-110 సీట్లు వస్తాయని చెప్పింది. ది న్యూస్ నేషన్ టీవీ ఎగ్జిట్ పోల్స్ 114-118 డీఎంకే-కాంగ్రెస్ ఖాతాలో వేయగా..95-99 స్థానాలు అన్నాడీఎంకేకు కట్టబెట్టింది. కానీ వాస్తవ ఫలితాలు..ఎగ్జిట్ పోల్స్ ను ఖంగు తినిపించాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి అన్నాడీఎంకే 136 స్థానాలు గెలుచుకొని జయలలిత నేతృత్వంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది.
ఉత్తరప్రదేశ్ – 2017 :
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. కానీ ఏ పోల్ కూడా బీజేపీ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని, సమాజ్‌వాది-కాంగ్రెస్ కూటమి, బీఎస్పీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని చెప్పలేకపోయాయి. ఏబీపీ-సీఎస్‌డీఎస్, ఇండియా టీవీ- సీఓటర్ పోల్స్ రెండూ బీజేపీ అత్యధిక స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుంది తప్ప మెజారిటీ రాదని అంచనా వేశాయి. ఇది నిజం కాలేదు. కానీ టుడేస్ చాణక్య, ఇండియా టుడే లు మాత్రం మాత్రం కొంతలో కొంత దగ్గరగా వచ్చాయి. చివరకు బీజేపీకి 403 మంది సభ్యులున్న సభలో 324 స్థానాలు లభించాయి.
అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్ని చూశాక నిన్న సిద్దరామయ్య చేసిన మాటలు కొంతవరకు నిజమయ్యేలా ఉన్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఈసారి చాలా ధీమాగా ఉన్నారు. శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది కాంగ్రెస్సేనని పోలింగ్ ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఇవన్నీ వినోదాన్ని పంచుతాయని ఎద్దేవా చేశారు. వారాంతంలో హాయిగా గడపాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మళ్ళీ వచ్చేది మనమేనని భరోసా ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం అనే విషయం మీరే డిసైడ్ చేయాలి మరి !!!