అవి నకిలీ అని భలే కనిపెట్టావ్ అమిత్ !

how can amit shah certify that video is fake

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నేతిబీర కాయలో నెయ్యి ఉండనట్లే భారతీయ జనతాపార్టీ విధానాల్లో నిజాయితీ ఉండదని ఓ సీపీఎం నేత వ్యాఖ్యానించారు ఒకప్పుడు కానీ చూడబోతే అది నిజమేననిపిస్తోంది. ఎందుకంటే నీతి నిజాయితీలకు తమ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ లుగా అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నేతలకు కొద్ది రోజులుగా నిజాయితీ-అవినీతి అనే పదాలు వింటుంటేనే భయం పట్టుకునే స్థితికి వచ్చేశారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా… జైల్లో గడిపివచ్చిన బీఎస్ ఎడ్యూరప్పను అలాగే లక్షల వేల కోట్ల మేర ప్రజల సొమ్ము దోచుకున్న రెడ్డి అండ్ కో కి ఎనిమిది టిక్కెట్లు ఇచ్చి ఇప్పుడు కక్కా లేక మింగాలేక ఉంది అన్న చందాన తయారయ్యింది బీజేపీ పరిస్థితి.

అది కేవలం ఆరోపణే కదా అని తప్పించుకుందాం అనుకుంటే సాక్ష్యాలతో సహా వారి బండారం బయటపడుతోంది. అత్యంత అవినీతిపరులుగా పేరు పడ్డ వారిని నేరుగా సమర్థించేందుకు వారిని కేసుల నుంచి బయటపడేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీ నేతలు నిలువుగా దొరికిపోతున్నారు. అలా దొరికిపోయినా తామేం తప్పు చేయడం లేదని సమర్థించుకుంటూ మరింతగా దిగజారిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ అక్రమాల పై కాంగ్రెస్ హయాంలో ఎక్కి తొక్కిన సీబీఐ ఇప్పుడు ఏమీ చేయలేమని చేతులెత్తేసిందని… ప్రచారం జరిగింది. దానికి సంబంధించి సీబీఐ రహస్యంగా కోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రాలు బయటకు వచ్చాయి. కర్ణాటక, గోవా, తమిళనాడు సీబీఐ అధికారులు అక్రమంగా తరలిపోయిన ఐరన్ ఓర్ తాలూక సాక్ష్యాలు ఏవీ లేవు కాబట్టి కేసులను క్లోజ్ చేసేశారు.

ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సీబీఐ అధికారులు దాఖలు చేసిన కేసులు మాత్రమె విచారణలో ఉన్నాయి. ఆ కేసులని కూడా ఎత్తేసినా ఎవరు మారు మాట్లాడకుండా స్వయానా మోడీ నే బళ్లారిపై అవినీతి ముద్ర వేశారని… అలా వేసిన వారిని శిక్షించాలంటూ.. పరోక్షంగా గాలి జనార్ధన్ రెడ్డిని నీతిమంతుడిగా చెబుతూ ఆయన అనుచరుల్ని గెలిపించాలని ప్రచారం చేశారు. గాలి సోదరుడు న్యాయమూర్తికి లంచం ఇచ్చిన కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పై ఉన్న సోమశేఖర్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఆయన ప్రచారం చేశారు. దాంతో మైనింగ్ డాన్‌కు మోదీ నేరుగా మద్దతిచ్చినట్లయింది.

తాజాగా అదే మైనింగ్ గ్యాంగ్..సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వందల కోట్ల ఇంచం ఇస్తున్నట్లు వీడియోలు విడుదలయ్యాయి. ఇలాంటి స్థితిలో కూడా బీజేపీ సదరు మైనింగ్ కింగ్ కి అండగా నిలుస్తోంది. కన్నడ టీవీ చానల్స్ బయటపెట్టిన వీడియోలపై ఇతర పార్టీల నేతలు విమర్శలు ప్రారంభిచక ముందే… బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా… వాటిని నకిలీ వీడియోలుగా ప్రకటించేశారు. నిజానికి వీడియోల్లో ఉన్న ఎంపి బి.శ్రీరాములు ఇంత వరకూ నోరు మెదపలేదు. కానీ… ఆయనకంటే ముందుగా అత్యుత్సాహంతో అమిత్ షా .. .. అవి నకిలీ వీడియోలను డిక్లేర్ చేసేశారు. ఈయన ఏవిధంగా ఆ వీడియోలు నకిలీవని ప్రకటిస్తారు. అవి నకిలీవో కాదో తేల్చాల్సింది ఎన్నికల సంఘం, కానీ అక్కడి దాక వెళ్ళకుండానే అవి నకిలీ విడియోలు అని ప్రకటించి మరో సారి గాలి మాఫియా కి అండగా నిలిచే ప్రయత్నం చేసింది బీజేపీ. చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి గుడిసేటి యేషాలు అనే మాట ప్రస్తుత బీజేపీ పరిస్థితికి కరెక్ట్గా సూట్ అవుతుంది అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.