టీడీపీ, బీజేపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం… రాళ్ల‌దాడిపై విమ‌ర్శ‌నాస్త్రాలు

war of words between BJP and TDP over Stones pelting on Amit Shah Convoy

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమిత్ షా తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాలు మ‌ళ్లీ వేడెక్కాయి. టీడీపీ, బీజేపీ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల‌దాడి జ‌రిగింద‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తోంటే… అస‌లు ఇలాంటి దాడే జ‌ర‌గ‌లేద‌ని టీడీపీ వాదిస్తోంది. అమిత్ షా పై దాడి జ‌ర‌గ‌డం దారుణ‌మ‌ని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. తిరుప‌తికి వ‌చ్చే వారిని అతిథులుగా గౌర‌వించాల‌ని, రాజ‌కీయ దురుద్దేశంతోనే టీడీపీ నేత‌లు దాడికి పాల్పడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇన్నాళ్లూ టీడీపీ అవినీతిలో మాత్ర‌మే కూరుకుపోయింద‌నుకున్నామ‌ని, కానీ ఆ పార్టీ గూండాల‌తో నిండిపోయింద‌ని ఇప్పుడు తెలిసింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అమిత్ షా కాన్వాయ్ పై దాడి జ‌రుగుతుంటే పోలీసులు ప్రేక్ష‌కపాత్ర వ‌హించ‌డం దారుణ‌మ‌ని, దేశం మొత్తం ఏపీని చీద‌రించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు.

వ్య‌క్తిగ‌త దాడుల‌తో టీడీపీ ఏం చెప్పాల‌నుకుంటోంద‌న్న విష‌యంపై సీనియ‌ర్ నేత‌న‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు స‌మాధానం చెప్పాల‌ని బీజేపీ మ‌రో ఎమ్మెల్యే ఆకుల స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. టీడీపీ త‌న వైఖ‌రితో ఏపీ ప్ర‌జ‌లు త‌ల‌దించుకునేలా చేశార‌ని, ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని అన్నారు. అటు అమిత్ షా కాన్వాయ్ పై రాళ్ల‌దాడి జ‌రిగింద‌న్న వార్త‌ల్లో వాస్త‌వం లేద‌ని తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ చెప్పారు. కావాలంటే సీసీకెమెరాల ఫుటేజీని ప‌రిశీలించుకోవ‌చ్చ‌ని తెలిపారు. టీడీపీ కార్య‌క‌ర్త‌లు కేవ‌లం న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న మాత్ర‌మే తెలిపార‌ని, ఆ స‌మయంలోనే అమిత్ షా కాన్వాయ్ వెళ్లింద‌ని చెప్పారు. కాన్వాయ్ వెళ్ల‌గానే బీజేపీ నేత‌లు వ‌చ్చి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడిచేశార‌ని చెప్పారు. శ్రీకాళ‌హ‌స్తికి చెందిన బీజేపీ నేత‌ కోలా ఆనంద్ అనుచ‌రులు, గ‌డ్డం ఉన్న మ‌రో వ్య‌క్తి టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడిచేశార‌ని, జెండాక‌ర్ర‌ల‌తో కొట్టార‌ని చెప్పారు. బీజేపీ నేత‌లు చేసిన ప‌నికి టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ నేత‌లే రెచ్చ‌గొడుతున్నార‌ని మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేత‌లు ఏపీపై చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను క‌ర్నాట‌క ప్ర‌జ‌లు కూడా గ‌మ‌నిస్తున్నార‌ని, ఆ పార్టీకి బుద్ధిచెబుతున్నార‌ని అన్నారు. అమిత్ షా వాహ‌నంపై దాడి జ‌ర‌గ‌లేద‌ని, ఆయ‌న వాహ‌నం వెన‌క ఉన్న మ‌రో వాహ‌నంపై రాయి ప‌డింద‌ని అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌న నిమిత్తం జ‌రుగుతున్న ఉద్య‌మం ప్ర‌శాంతంగా జ‌రుగుతోంద‌ని, ఈ ఉద్య‌మాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు అనేక శ‌క్తులు ప‌నిచేస్తున్నాయ‌ని ఆరోపించారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల ముసుగులో ఎవ‌రో దాడిచేసి ఉంటార‌ని చిన‌రాజ‌ప్ప అనుమానాలు వ్య‌క్తంచేశారు. అటు ఈ ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని, టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల పార్టీ అని, అంద‌రూ దానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని చెప్పారు. క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘిస్తే… క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఇటువంటి ప్ర‌వ‌ర్త‌న‌తో పార్టీకి చెడ్డ‌పేరు తీసుకురావొద్ద‌ని సూచించారు. ఏ స‌మ‌యంలో ఎలా స్పందించాలో అంద‌రూ తెలుసుకోవాల‌ని, అధికారంలో ఉన్న‌ప్పుడు మ‌రింత బాధ్య‌త‌గా ఉండాల‌ని ఆయ‌న అన్నారు.