Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశమంతా హోలీ సంబరాల్లో మునిగితేలుతున్న వేళ తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని అటవీప్రాంతం కాల్పుల మోతలతో దద్దరిల్లింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అతిపెద్ద ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం తడపలగుట్ట-ఛత్తీస్ గఢ్ లోని పూజారికాంకేడు సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. వీరిలో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ ఉన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి తుపాకులు, స్కానర్, ల్యాప్ ట్యాప్, రూ.41వేల నగదును పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. పూజారికాంకేడు ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న భద్రతాదళాలు, తెలంగాణ, చత్తీస్ గఢ్ పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. అదే సమయంలో భద్రతాబలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. తమకు ఎదురైన మావోలను లొంగిపోవాలని హెచ్చరించినా…వినకుండా ఫైరింగ్ ప్రారంభించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ మొదలుపెట్టాల్సివచ్చిందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్ కౌంటర్ లో 20 మంది మావోయిస్టులు మరణించగా మరికొందరు పరారయ్యారు. మిగిలినవారి కోసం కూంబింగ్ దళాలు సమీప గ్రామాల్లో గాలింపు చేపట్టాయి.
అదనపు బలగాలను హెలికాప్టర్లలో సంఘటనాస్థలానికి తరలించారు. ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని, వారికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన మావోయిస్టుల్లో పలువురుని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో హరిభూషణ్ ఉన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ధృవీంకరించలేదు. దాదాపు మూడు దశాబ్దాలక్రితం మావోయిస్టుల్లో చేరిన హరిభూషణ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.